కేబీసీలో ఒక్కసారిగా ఏడ్చేసిన కండల వీరుడు జాన్ అబ్రహాం.. ఇదిగో వీడియో

25-11-2021 Thu 15:01
  • రేపు ప్రసారం కానున్న ఎపిసోడ్
  • అమితాబ్ ఇంటికి వెళ్లిన సందర్భాన్ని గుర్తు చేసుకున్న జాన్
  • బైక్ పై వెళ్తే అభిషేక్ ను ప్రోత్సహించవద్దన్నారు
  • అభిషేక్ రాగానే మాట మార్చారు
John Abraham Breaks Down In KBC
బాలీవుడ్ కండల వీరుడు జాన్ అబ్రహాం ఒక్కసారిగా ఏడ్చేశాడు. అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న కౌన్ బనేగా కరోడ్ పతి 13 షోలో ‘సత్యమేవ జయతే 2’ హీరోహీరోయిన్లయిన జాన్ అబ్రహాం, దివ్యా ఖోస్లా కుమార్ లు పాల్గొన్నారు. రేపు ప్రసారమయ్యే ఎపిసోడ్ కు సంబంధించి సోనీ టీవీ ఓ ప్రోమోను విడుదల చేసింది.

అందులో జాన్ అబ్రహాం తనదైన శైలిలో హాట్ సీట్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. తన సిక్స్ ప్యాక్ ను ప్రదర్శించాడు. ఒక్కసారిగా అక్కడున్న అభిమానులు కేకలతో హోరెత్తించారు. అమితాబ్ కలుగజేసుకుని అంతా అమ్మాయిలే కేకలేస్తున్నారంటూ నవ్వేశారు. బంతిని చేతివేళ్లపై తిప్పారు. ‘ధూమ్’ సినిమా తర్వాత ఓసారి తాను అమితాబ్ ఇంటికి వెళ్లిన సందర్భాన్ని జాన్ గుర్తు చేసుకున్నాడు.

‘‘నేను బైక్ పై వస్తే అభిషేక్ ను మాత్రం ఈ విషయంలో ప్రోత్సహించవద్దంటూ మీరు నాకు చెప్పారు.. గుర్తుందా!’’ అంటూ చెప్పాడు. అభిషేక్ కిందకురాగానే ‘వావ్.. బైక్ చాలా బాగుందని మాట మార్చేశారు’ అని గుర్తు చేశాడు. ఆ తర్వాత కాసేపటికే కన్నీటి పర్యంతమయ్యాడు. మరి, అతడి దు:ఖానికి కారణమేంటో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ చూడాల్సిందే!