Chiranjeevi: సినిమా టికెట్ల రేట్లను అన్ని రాష్ట్రాల్లో ఉన్న విధంగా నిర్ణయించండి: సీఎం జగన్ కు చిరంజీవి విజ్ఞప్తి

Chiranjeevi appeals CM Jagan to rethink on online ticketing
  • సినిమాటోగ్రఫీ చట్ట సవరణ బిల్లు ప్రవేశపెట్టిన ఏపీ సర్కారు
  • రాష్ట్రంలో ఆన్ లైన్ టికెట్ల విధానం
  • బిల్లును స్వాగతించిన చిరంజీవి
  • అయితే టికెట్ల అంశంపై పునరాలోచించాలని వినతి

ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో సినిమాటోగ్రఫీ చట్టం సవరణ బిల్లు ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇకపై ఏపీలో ఆన్ లైన్ టికెటింగ్ విధానం అమల్లోకి రానుంది. తద్వారా ప్రభుత్వం నిర్దేశించిన మేరకే టికెట్ల ధరలు ఉంటాయి. గతంలో మాదిరి ఇష్టంవచ్చినట్టు టికెట్ల ధరలు పెంచుకోవడం ఇక కుదరదు. అసెంబ్లీలో మంత్రి పేర్ని నాని చట్ట సవరణ బిల్లు ప్రవేశపెట్టిన నేపథ్యంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి స్పందించారు.

పరిశ్రమ కోరిన విధంగా పారదర్శకత కోసం రాష్ట్రంలో ఆన్ లైన్ టికెట్ల విధానానికి వీలు కల్పించే బిల్లు ప్రవేశపెట్టడం హర్షణీయం అని పేర్కొన్నారు. అయితే, థియేటర్ల మనుగడను దృష్టిలో ఉంచుకోవాలని, సినిమాని ఆధారంగా చేసుకున్న ఎన్నో కుటుంబాల బతుకు తెరువు కోసం తగ్గించిన టికెట్ల ధరలపై కాలానుగుణంగా సరైన నిర్ణయం తీసుకోవాలని ఏపీ సీఎం జగన్ ను కోరారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉన్న విధంగా టికెట్ల ధరలను సముచిత రీతిలో నిర్ణయిస్తే పరిశ్రమకు మేలు జరుగుతుందని చిరంజీవి అభిప్రాయపడ్డారు.

దేశమంతా ఒకటే జీఎస్టీతో ప్రభుత్వాలు పన్నులను వసూలు చేస్తున్నప్పుడు టికెట్ ధరలలో కూడా అదే వెసులుబాటు ఉండడం సమంజసం అని పేర్కొన్నారు. దయచేసి టికెట్ల ధరల అంశాన్ని పునరాలోచించాలని సీఎం జగన్ కు విజ్ఞప్తి చేశారు. ఆ విధమైన ప్రోత్సాహం ఉన్నప్పడే తెలుగు పరిశ్రమ నిలదొక్కుకోగలుగుతుందని చిరంజీవి ఆశాభావం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News