భారీస్థాయిలో 'శ్యామ్ సింగ రాయ్' ప్రమోషన్స్!

25-11-2021 Thu 11:15
  • కలకత్తా నేపథ్యంలో నడిచే కథ 
  • నాని సరసన ముగ్గురు నాయికలు 
  • అభిమానులతో 'ఫ్యామిలీ మీట్'
  • డిసెంబర్ 24వ తేదీన విడుదల   
Shyam Singha Roy movie update
నాని కథానాయకుడిగా రాహుల్ సాంకృత్యన్ 'శ్యామ్ సింగ రాయ్' సినిమాను రూపొందించాడు. కలకత్తా నేపథ్యంలో నడిచే కథ ఇది. ఒకప్పుడు అక్కడ స్త్రీల పట్ల సాగిన దురాచారాలను ప్రశ్నించే జర్నలిస్ట్ పాత్రలో నాని కనిపించనున్నాడు. వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ సినిమాను, డిసెంబర్ 24వ తేదీన వివిధ భాషల్లో విడుదల చేయనున్నారు.

కథాపరంగా ఈ సినిమాలో ముగ్గురు నాయికలు కనిపించనున్నారు. సాయిపల్లవి .. కృతి శెట్టి .. మడోన్నా సెబాస్టియన్ పాత్రలు ప్రాధాన్యత కలిగి ఉండటం విశేషం. ఈ సినిమా ప్రమోషన్స్ ను ఒక రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారట. ప్రెస్ మీట్లు .. ప్రీ రిలీజ్ ఈవెంట్లు మాత్రమే కాకుండా, ఈ సినిమా టీమ్ మేజర్ సిటీస్ కి తిరుగుతుందట.

ఎక్కడికక్కడ పెద్ద సంఖ్యలో జనాలను కలిసి, వాళ్ల దృష్టికి ఈ సినిమాను తీసుకెళ్లడానికి కొత్తగా ప్రణాళిక రచన చేస్తున్నారట. ఒక సిటీలో 3 వేలమంది అభిమానులతో 'ఫ్యాన్ మీట్' ను కూడా ఏర్పాటు చేయనున్నారని చెబుతున్నారు. వాళ్ల ప్రశ్నలకు నాని సమాధానాలు చెప్పడమే కాకుండా, అందరితో కలిసి అక్కడే భోజనం చేస్తాడని అంటున్నారు. మొత్తానికి ఒక కొత్త ప్రచార కార్యక్రమానికి తెరలేపుతున్నారనే అనుకోవాలి.