న‌న్ను అరెస్టు చేయ‌డానికి వ‌స్తే నా స‌మాధానం ఇలా ఉంటుంది: హీరోయిన్ కంగ‌న‌

25-11-2021 Thu 10:50
  • రైతుల పోరాటాన్ని ఖ‌లిస్థానీ ఉద్య‌మం అంటారంటూ ఇటీవ‌ల పోస్ట్
  • కంగ‌న‌పై విమ‌ర్శ‌లు
  • మ‌రోసారి కంగ‌న తీవ్ర వ్యాఖ్య‌లు
  • మ‌ద్యం గ్లాసు ప‌ట్టుకుని ఫొటో పోస్ట్
kangana on fir against her
కేంద్ర ప్ర‌భుత్వం తీసుకొచ్చిన సాగు చట్టాలను ఇటీవ‌ల‌ రద్దు చేసిన నేప‌థ్యంలో సిక్కులపై హీరోయిన్ కంగ‌నా ర‌నౌత్ చేసిన‌ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆమెపై పోలీసు కేసు కూడా నమోదయింది. రైతుల తీరును ఆమె ఖ‌లిస్థానీ ఉద్య‌మం అంటారంటూ సామాజిక మాధ్య‌మాల్లో పోస్టు చేసింది. ఈ నేప‌థ్యంలోనే ఆమెపై సబ్‌ అర్బన్‌ ఖార్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఢిల్లీ సిక్‌ గురుద్వారా మేనేజ్‌మెంట్‌ కమిటీ కంగనాపై ఫిర్యాదు చేసింది.  

రైతులు కొన‌సాగించిన‌ ఉద్యమాన్ని కంగ‌నా ఉద్దేశ‌పూర్వ‌కంగా ఖలిస్థానీ ఉద్యమం అన్నార‌ని, అలాగే, సిక్కులను ఖలిస్థానీ ఉగ్ర‌వాదులని అన్నార‌ని ఫిర్యాదులో కమిటీ పేర్కొంది. దీనిపై కంగనా సోషల్‌ మీడియా ద్వారా స్పందించింది. చేతిలో మ‌ద్యం గ్లాసు పట్టుకుని గతంలో దిగిన ఓ ఫొటోను పోస్ట్ చేసింది.

మ‌రో ఎఫ్ఐఆర్ కూడా న‌మోదు చేశార‌ని, ఒక‌వేళ త‌న‌ను అరెస్ట్ చేసేందుకు వ‌స్తే ఇంటి ద‌గ్గ‌ర త‌న మూడ్ ఇలా ఉంటుంద‌ని ఆమె త‌న ఫొటోను చూపింది. సిక్కుల‌పై ఆమె చేసిన వ్యాఖ్య‌ల ప‌ట్ల క్షమాప‌ణ‌లు చెప్పాల‌ని డిమాండ్ వ‌స్తోంది. ఈ స‌మ‌యంలో కంగ‌నా మ‌రోసారి రెచ్చ‌గొట్టే విధంగా వ్యాఖ్య‌లు చేయ‌డం గ‌మ‌నార్హం.