Amaravati: బొబ్బలెక్కిన రైతుల కాళ్లను చూసి చలించిన ప్రజలు.. పాలతో పాదాలను శుభ్రం చేసిన నాయకులు

 Leaders cleaned amaravati farmers feet with milk
  • నిన్నటితో 24వ రోజుకు చేరుకున్న మహాపాదయాత్ర
  • పాదయాత్రకు నేడు విరామం
  • బంతిపూలతో స్వాగతం పలికిన స్థానికులు
  • గ్రామ పొలిమేర్లలో రంగవల్లులు
అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ మహాపాదయాత్ర చేస్తున్న రాజధాని రైతులకు అపూర్వ స్వాగతం లభిస్తోంది. నిన్న పాదయాత్ర 24వ రోజున నెల్లూరు జిల్లాలోని సున్నంబట్టి గ్రామం నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. రాచర్లపాడు, రేగడిచెలిక, పెయ్యలపాళెం, చంద్రశేఖరపురం, పైడేరు, కమ్మపాళెం, బొడ్డువారిపాళెం, నాయుడుపాళెం, గండవరం రోడ్డు మీదుగా 15 కిలోమీటర్ల పాటు సాగి రాజుపాళెం చేరుకుంది. అక్కడ రైతులకు ఘన స్వాగతం లభించింది. వందలాదిమంది రైతులు వారికి ఎదురువెళ్లి స్వాగతం పలికారు.

యాత్ర చేస్తున్న రైతుల పాదాలకు బొబ్బలు, పుండ్లు చూసి చలించి పోయిన ప్రజలు, వివిధ పార్టీల నాయకులు వారి పాదాలను పాలతో కడిగారు. మరోవైపు, రైతుల మహాపాదయాత్రకు స్థానికులు దారిపొడవునా బంతిపూలతో స్వాగతం పలికారు. గ్రామ పొలిమేర్లలో రంగువల్లులు తీర్చిదిద్దారు. పలువురు నేతలు, ప్రవాసాంధ్రులు రైతులకు మద్దతు తెలిపారు. పాదయాత్ర చేస్తున్న రైతులకు సంఘీభావం తెలిపేందుకు వస్తున్న వారిపై కేసులు పెట్టడంపై ప్రజాసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. రైతుల మహాపాదయాత్రకు నేడు విరామం ఉంటుందని, రేపు యథావిధిగా ప్రారంభమవుతుందని అమరావతి జేఏసీ తెలిపింది.
Amaravati
Mahapadayatra
Farmers
Andhra Pradesh

More Telugu News