వరద బాధితులకు ప్రభుత్వం నుంచి ఓదార్పు ఏదీ?: పవన్ కల్యాణ్

24-11-2021 Wed 21:55
  • కడప జిల్లాలో నాదెండ్ల మనోహర్ పర్యటన
  • వరద బాధితులకు పరామర్శ
  • నిత్యావసరాలు, పాత్రలు అందజేత
  • సోషల్ మీడియాలో స్పందించిన పవన్
Pawan Kalyan questions AP govt on floods lashed out Kadapa district
కడప జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పర్యటించారు. దీనిపై జనసేనాని పవన్ కల్యాణ్ సోషల్ మీడియాలో స్పందించారు. జలవిలయం జన జీవనాన్ని ఎలా అతలాకుతలం చేసిందో కడప జిల్లా తొగురుపేట, ఎగువ మందపల్లి గ్రామాలను చూస్తే తెలుస్తుందని పేర్కొన్నారు. ఆ గ్రామాల్లో కూలిన ఇళ్లు, మేటలు వేసిన పొలాలు కనిపిస్తున్నాయని వెల్లడించారు. అయిన వాళ్లను కోల్పోయిన వారి బాధలు వర్ణనాతీతం అని తెలిపారు.

జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆయా గ్రామాల్లో పర్యటించి బాధితులను పరామర్శించారని, వారికి నిత్యావసరాలు, పాత్రలు, దుప్పట్లు ఇచ్చారని పవన్ వెల్లడించారు. ఆ గ్రామాల్లో ఇప్పటికీ విద్యుత్ సరఫరా పునరుద్ధరించలేదని, ప్రజలు అంధకారంలో మగ్గుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గూడు కోల్పోయి నిరాశ్రయులైన ఆ బాధితులకు ప్రభుత్వం నుంచి ఓదార్పు ఏదీ? అని ప్రశ్నించారు.