Team India: ‘వ్యవస్థీకృత గందరగోళం’.. కివీస్ జట్టులో ముంబై స్పిన్సర్.. అందరి కళ్లూ అతడి పైనే!

  • 8 ఏళ్ల వయసులో తల్లిదండ్రులతో కలిసి న్యూజిలాండ్‌కు వలస
  • ముంబైలో జన్మించిన అజాజ్ పటేల్
  • ఇండియాలో ఇండియాను ఎదుర్కోవడం అంతా ఆషామాషీ ఏమీ కాదన్న పటేల్
  • వర్ణించలేని ప్రదేశాలలో భారతదేశం ఒకటి
Mumbai Born New Zealand Spinner Ajaz Patel Excited For first test

రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా భారత్-న్యూజిలాండ్ మధ్య రేపు కాన్పూరులో తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఈ టెస్టు ప్రారంభానికి ముందే కివీస్ జట్టు స్పిన్నర్ అజాజ్ పటేల్ అందరి దృష్టిని ఆకర్షించాడు. కారణం అతడు భారతీయుడు కావడమే. ముంబైలో జన్మించిన 33 ఏళ్ల పటేల్ 8 ఏళ్ల వయసులో తల్లిదండ్రులతో కలిసి న్యూజిలాండ్‌కు వలస వెళ్లాడు. ఇప్పుడు భారత్‌ను ఎదుర్కొనే కివీస్ జట్టులో చోటు సంపాదించుకున్న అతడు సొంత దేశంపైనే సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నాడు. జూన్ నుంచి ఒక్క ఫస్ట్ క్లాస్ మ్యాచ్ కూడా ఆడని పటేల్ ఇప్పుడు భారత్‌తో జరిగే టెస్టులో కీలక పాత్ర పోషించాలని భావిస్తున్నాడు.

బ్లాక్ కేప్స్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసిన వీడియోలో ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ మాట్లాడుతూ ఈ సిరీస్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు చెప్పాడు. ‘‘భారతదేశమంటే భారతదేశమే. వర్ణించలేని ప్రదేశాలలో ఇదొకటి. దానిని మీరు అనుభవించాల్సి ఉంటుంది. ఒకానొక సమయంలో దీనిని నేను ‘వ్యవస్థీకృత గందరగోళం’గా భావిస్తాను. ఇది  నిజంగా ఎంతో ప్రత్యేకమైనది’’ అని పటేల్ ఆ వీడియోలో పేర్కొన్నాడు.

టీనేజ్‌లో స్పిన్నర్‌గా రాణించిన పటేల్ ప్రస్తుతం లెఫ్టార్మ్ స్పిన్నర్‌గా సత్తా చాటుతున్నాడు. ఓ స్పిన్నర్‌గా ఇండియాను సొంతగడ్డపై ఎదుర్కోవడం అంత ఆషామాషీ ఏమీ కాదన్న పటేల్.. భారత్‌ను ఎదుర్కొనేందుకు ఉత్సాహంగా ఉన్నట్టు చెప్పాడు. టెస్టు సిరీస్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు పేర్కొన్నాడు.

న్యూజిలాండ్‌తో ఇటీవల జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను రోహిత్ సేన 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. విశ్రాంతిలో ఉన్న విరాట్ కోహ్లీ తొలి టెస్టుకు కూడా అందుబాటులో ఉండడం లేదు. దీంతో అజింక్య రహానే తొలి టెస్టుకు సారథ్యం వహిస్తాడు. రెండో టెస్టుకు మాత్రం కోహ్లీ సారథ్యంలోనే జరగనుంది.

More Telugu News