అయ్యన్నపాత్రుడిని అడ్డుకున్న పోలీసులు.. నడిరోడ్డుపై ధర్నాకు దిగిన టీడీపీ నేత

24-11-2021 Wed 17:11
  • చంద్రబాబు కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళన
  • వేలాదిగా తరలివచ్చిన టీడీపీ కార్యకర్తలు
  • పోలీసులు, టీడీపీ కార్యకర్తల మధ్య తోపులాట
Tension prevailed in Narsipatnam as police stop TDP leader ayyanna
అసెంబ్లీలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ విశాఖపట్టణం జిల్లా నర్సీపట్నంలో టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడి నివాసం నుంచి పోలీస్ స్టేషన్‌ వరకు ప్రదర్శనగా వెళ్లి ఫిర్యాదు చేయాలని టీడీపీ శ్రేణులు నిర్ణయించాయి. అయితే, ర్యాలీకి అనుమతి లేదన్న కారణంతో పోలీసులు వారిని మార్గమధ్యంలోనే అడ్డుకున్నారు. ఈక్రమంలో పోలీసులను దాటుకుని ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించిన అయ్యన్నపాత్రుడిని పోలీసులు అడ్డుకోవడంతో ఆయన నడిరోడ్డుపై ధర్నాకు దిగారు. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్తత నెలకొంది.

ఈ క్రమంలో పోలీసులు, టీడీపీ కార్యకర్తలకు మధ్య జరిగిన తోపులాటలో పలువురు మహిళా కార్యకర్తలకు స్వల్ప గాయాలయ్యాయి. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి.. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న కార్యకర్తలపై లాఠీచార్జి చేయడం దారుణమన్నారు. ఎంతసేపైనా సరే రోడ్డుపైనే బైఠాయిస్తామని,  పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసి తీరుతామని తేల్చి చెప్పారు. ఈ ఆందోళనలో నర్సీపట్నంతోపాటు పరిసర గ్రామాలనుంచి కూడా వేలాదిమంది కార్యకర్తలు, టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత, ఇతర సీనియర్ నేతలు పాల్గొన్నారు.