Andhra Pradesh: రాష్ట్ర సర్కారు నిర్వాకం వల్లే రాష్ట్రంలో వరదలు: చంద్రబాబు

Chandrababu Fires On YCP Government Over Floods
  • చిత్తూరు జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన
  • వాటర్ మేనేజ్ మెంట్ పై ఏపీ సర్కారుకు అవగాహన లేదని కామెంట్
  • ఏనాడూ తన భార్య బయటకు రాలేదు
  • అలాంటి ఆమెపై అనుచిత వ్యాఖ్యలు చేశారు
  • కుప్పంలో రౌడీయిజంతో గెలిచారని కామెంట్

రాష్ట్ర ప్రభుత్వం నిర్వాకం వల్లే ఏపీలో వరదలు సంభవించాయని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. వరదలకు మానవ తప్పిదాలే కారణమని, ప్రభుత్వానికి వాటర్ మేనేజ్ మెంట్ తెలియదని విమర్శించారు. వర్షాలు వస్తాయని తెలిసినా ముందు జాగ్రత్త చర్యలేవీ చేపట్టలేదన్నారు. ఇవాళ ఆయన చిత్తూరు జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. వరదలపై స్థానిక టీడీపీ నేతలు ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ లో వరద పరిస్థితిని తెలుసుకున్నారు.

గొలుసుకట్టు చెరువుల్లోని నీటిని వరద రాకముందే విడిచిపెట్టాల్సి ఉంటుందని, లేకపోతే మిగతా చెరువులన్నీ నిండిపోయి వరద పోటెత్తే ప్రమాదం ఉంటుందని ఆయన చెప్పారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాత్రిపూట కూడా పని చేశానని, క్షేత్రస్థాయిలో ఉండి కలెక్టర్లతో కలిసి వరద నియంత్రణకు చర్యలు చేపట్టానని గుర్తు చేశారు. వరద బాధితులు, మృతుల కుటుంబాలకు సాయం అందే వరకు పోరాటం చేస్తామన్నారు.
టీడీపీ 22 ఏళ్ల పాటు ఉమ్మడి రాష్ట్రాన్ని, ఏపీని పాలించినా తన భార్య భువనేశ్వరి ఏనాడూ బయటకు రాలేదని చంద్రబాబు చెప్పారు. అలాంటి తన భార్య వ్యక్తిత్వంపై అసెంబ్లీలో అసభ్యపదజాలంతో దూషించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అలిపిరిలో క్లెమోర్ మైన్స్ పెట్టి తన కారును పేల్చేసినా తాను భయపడలేదని, కానీ, తన భార్యపై చేసిన అవహేళనకు తట్టుకోలేకపోయానని అన్నారు. తప్పుడు పనులు చేసేవారిని వదిలే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. 40 ఏళ్లలో ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొన్నానన్నారు. తాను అధికారంలోకి వస్తే వైసీపీ పెట్టిన అక్రమ కేసులపై విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

కుప్పంలో దౌర్జన్యం, రౌడీయిజం చేసి వైసీపీ గెలిచిందని చంద్రబాబు అన్నారు. చిన్న పట్టణంలో అక్రమాలతో గెలిచి మొనగాళ్లమంటూ విర్రవీగుతున్నారని కామెంట్ చేశారు. దొంగ ఓట్లతో దౌర్జన్యంగా గెలిచారన్నారు. టీడీపీ ఎవరి కోసం పోరాడుతోందో రాష్ట్రంలోని ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. తాను కంపెనీలు తెస్తే.. వీళ్లేమో దందాలు చేస్తున్నారని, ఇలాంటి ఉన్మాదులతో పోరాడాలా? అని ఆయన ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News