Andhra Pradesh: ముగిసిన కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక.. భారీ బందోబస్తు

Stern Vigilance At Kondapally Municipality
  • ఎన్నికకు ముందు వార్డు సభ్యులతో ప్రమాణం
  • 750 మంది పోలీసులతో పహారా
  • మున్సిపల్ ఆఫీసు వద్దే 400 మంది
  • ఎన్నిక నిర్వహించాలని నిన్న హైకోర్టు ఆదేశం
కృష్ణా జిల్లా కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ముగిసింది. రెండు రోజులుగా వాయిదా పడుతూ వస్తున్న ఎన్నికను.. హైకోర్టు ఆదేశాలతో ఇవాళ అధికారులు నిర్వహించారు. టీడీపీ ఎంపీ కేశినేని నాని, వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ల నేతృత్వంలోని సభ్యులు కొండపల్లి మున్సిపల్ ఆఫీసుకు వచ్చారు. ఎన్నికకు ముందు వార్డు సభ్యులతో రిటర్నింగ్ అధికారి ప్రమాణం చేయించారు. అనంతరం ఎన్నికను పూర్తి చేశారు. ఎన్నిక వివరాలను హైకోర్టుకు అందజేయనున్నారు. ఎన్నిక నేపథ్యంలో.. అక్కడ భారీగా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. 750 మంది పోలీసులు గస్తీ కాశారు. ఒక్క మున్సిపల్ ఆఫీసు దగ్గరే 400 మంది పహారా కాస్తున్నారు.

కోర్టును ఆశ్రయించిన టీడీపీ కౌన్సిలర్లు, స్వతంత్ర అభ్యర్థి కె. శ్రీలక్ష్మి, ఎంపీ కేశినేని నానిలకు ఎన్నికల ప్రక్రియ అయిపోయేంత వరకు పోలీస్ భద్రత కల్పించాలని విజయవాడ పోలీస్ కమిషనర్ జి.పాలరాజుకు హైకోర్టు ఆదేశాలిచ్చిన నేపథ్యంలో.. వారికీ సెక్యూరిటీనిచ్చారు. కాగా, చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను నిర్వహించినా ఫలితాలను ప్రకటించకూడదని కోర్టు స్పష్టం చేసింది. కేశినేని నాని ఓటు హక్కు వినియోగం తామిచ్చే తీర్పుకు లోబడే ఉండాలని తేల్చి చెప్పింది.

వాస్తవానికి సోమవారమే ఎన్నిక జరగాల్సి ఉన్నా.. టీడీపీ ఎంపీ కేశినేని నాని ఓటు (ఎక్స్ అఫీషియో) చెల్లదని వైసీపీ నేతలు అభ్యంతరం చెప్పడంతో వాయిదా పడింది. నిన్న వైసీపీ సభ్యులెవరూ ఓటింగ్ లో పాల్గొనలేదు. కేశినేని నానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బయటకు వచ్చేశారు. దీంతో హైకోర్టు ఇవాళ ఎట్టిపరిస్థితుల్లోనూ ఎన్నిక నిర్వహించాలని, ఫలితాలు వెల్లడించకూడదని ఆదేశించింది.
Andhra Pradesh
Kondapally
AP High Court
High Court

More Telugu News