ISRO: అంతరిక్ష వ్యర్థాలకు విరుగుడుగా ఇస్రో కొత్త సాంకేతిక పరిజ్ఞానం

  • అంతరిక్షంలో నిరుపయోగంగా శాటిలైట్లు
  • ఇటీవల కాలంలో పేల్చివేస్తున్న పలు దేశాలు
  • తమకు తామే ధ్వంసం చేసుకునే కొత్త టెక్నాలజీ
  • ఇస్రో లక్ష్యం అదేనన్న చైర్మన్ కె.శివన్
ISRO develops new tech to destroy rockets and satellites themselves

అంతరిక్షంలో వేల సంఖ్యలో ఉపగ్రహాలు నిరంతరం భూమి చుట్టూ పరిభ్రమిస్తుంటాయి. అయితే వాటిలో కొన్ని కాలంచెల్లిన శాటిలైట్లు నిరర్ధకంగా ఉంటాయి. ఇటీవల అలాంటి ఓ శాటిలైట్ ను రష్యా పేల్చివేసింది. గతంలోనూ చైనా ఇదే పని చేసింది. అయితే వాటి శకలాలు ఇంకా అంతరిక్షంలోనే వ్యర్థాల రూపంలో ఉండడం శాస్త్రవేత్తలను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేస్తోంది.

అంతరిక్షంలోకి ప్రయోగించే రాకెట్లు ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టాక సముద్రంలో కూలిపోతుంటాయి. అవి కూడా సముద్రంలో వ్యర్థాలుగా పరిణమిస్తుంటాయి. ఇస్రో అభివృద్ధి చేస్తున్న కొత్త టెక్నాలజీ సాయంతో ఈ రాకెట్లు తమ పని పూర్తయ్యాక అంతరిక్షంలో తమను తామే ధ్వంసం చేసుకుంటాయి. అది కూడా ఎలాంటి అంతరిక్ష వ్యర్థాలు ఏర్పడని రీతిలో! దీనిపై ఇస్రో చైర్మన్ కె.శివన్ వివరణ ఇచ్చారు.

"సాధారణంగా రాకెట్ల చుట్టూ లోహపు కవచం ఉంటుంది. రాకెట్లను లాంచ్ చేసిన తర్వాత వాటి చివరి దశలో సముద్రంలో పడిపోతుంటాయి. అందుకే మేం కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపొందిస్తున్నాం. రాకెట్ల చుట్టూ ఉండే కేసింగ్ తయారీకి కొత్త రకం పదార్థాలు ఉపయోగించాలనుకుంటున్నాం. రాకెట్లలోని మోటార్లతో పాటే ఆ కేసింగ్ కూడా కాలిపోతుంది. తద్వారా ఎలాంటి వ్యర్థాలు మిగలవు" అని వెల్లడించారు.

అంతరిక్షంలో తిరుగాడే శాటిలైట్లకు కూడా ఇదే టెక్నాలజీ వర్తిస్తుందని, ఓ బటన్ నొక్కితే చాలు ఆ శాటిలైట్ స్వీయ వినాశనం చేసుకుంటుందని వివరించారు. అంతరిక్ష పరిశోధనల రంగంలోకి ప్రైవేటు సంస్థలు కూడా ప్రవేశించి, నిత్యం ఏదో ఒక ప్రయోగం నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇస్రో... క్వాంటమ్ కమ్యూనికేషన్స్, అడ్వాన్స్ డ్ రాడార్లపై మరింత పరిశోధన చేయాలని భావిస్తోంది.

More Telugu News