Cricket: చాంపియన్స్ ట్రోఫీ.. పాక్ లో టీమిండియా ఆడుతుందన్న ఐసీసీ

India Will Participate In Champions Trophy In Pakistan Says ICC
  • పాక్ లో 2025 చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ
  • చాలా దేశాలు వస్తాయా? రావా? అన్న అనుమానం
  • దానిపై స్పందించిన ఐసీసీ చైర్మన్
  • అన్ని దేశాలూ వస్తాయన్న గ్రెగ్ బార్ క్లే
  • టోర్నీకి ఇంకా చాలా టైం ఉందని కామెంట్
  • భారత్ ను తీసుకురావడం సవాలేనని వెల్లడి
పాకిస్థాన్ లో టీమిండియా మళ్లీ క్రికెట్ ఆడుతుందని, చాంపియన్స్ ట్రోఫీ కోసం పాక్ కు వెళ్తుందని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) పేర్కొంది. భవిష్యత్ ట్రోఫీలు, మ్యాచ్ ల షెడ్యూళ్లను గత వారం ఐసీసీ విడుదల చేసిన సంగతి తెలిసిందే. 2025 చాంపియన్స్ ట్రోఫీని పాకిస్థాన్ లో నిర్వహిస్తున్నట్టు వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే భారత్ సహా వివిధ దేశాలు పాక్ కు వెళ్తాయా? అన్న దానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

దానిపై తాజాగా ఐసీసీ చైర్మన్ గ్రెగ్ బార్ క్లే స్పందించారు. రెండు దశాబ్దాల తర్వాత రాకరాక పాకిస్థాన్ కు ఐసీసీ ట్రోఫీని నిర్వహించే అవకాశం వచ్చిందన్నారు. కచ్చితంగా అన్ని దేశాల టీంలు పాక్ కు వెళ్తాయన్నారు. గత కొన్ని వారాల్లో ఏం జరిగిందన్నది అప్రస్తుతమని, షెడ్యూల్ కు ఎవరూ అడ్డు చెప్పలేదని అన్నారు. ఈవెంట్ ను నిర్వహించే శక్తి పాకిస్థాన్ కు లేదని భావిస్తే అసలు ఐసీసీనే ఆ ఈవెంట్ ను పాకిస్థాన్ కు ఇచ్చేది కాదన్నారు. పాకిస్థాన్ కు ఇదో గొప్ప అవకాశమన్నారు. టోర్నమెంట్ నిర్వహించే 2025కు ఇంకా చాలా సమయం ఉందని, అప్పటివరకు అన్ని దేశాల ఆటగాళ్ల భద్రతకు సంబంధించి పటిష్ఠమైన చర్యలు తీసుకుంటారని అన్నారు.

భారత్ ను పాక్ లో ఆడించడం కొంత సవాల్ తో కూడుకున్నదేనని, కానీ, క్రికెట్ రెండు దేశాల మధ్య సమస్యలను పరిష్కరిస్తుందన్న ఆశాభావం ఉందని బార్ క్లే చెప్పారు. ఇండియా కూడా పాక్ లో చాంపియన్స్ ట్రోఫీలో భాగమవుతుందని అన్నారు. అయితే భౌగోళిక రాజకీయ పరిణామాలు తమ చేతుల్లో లేవని, అయితే, క్రికెట్ రెండు దేశాల మధ్య బంధాన్ని పెంచుతుందని భావిస్తున్నానని ఆయన చెప్పుకొచ్చారు.
Cricket
Team India
ICC
Champions Trophy
Pakistan

More Telugu News