Congress: కాంగ్రెస్‌కు షాక్.. టీఎంసీ గూటికి టీమిండియా మాజీ క్రికెటర్

Congress leader Kirti Azad to join TMC today in Delhi Today
  • 1983లో ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడు
  • 2019లో బీజేపీని వీడి కాంగ్రెస్‌లోకి
  • ఆ ఎన్నికల్లో ధన్‌బాద్ నుంచి పోటీ చేసి ఓటమి
  • నేడు న్యూఢిల్లీలో టీఎంసీలో చేరిక
పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత దూకుడు పెంచిన టీఎంసీ అధినేత్రి, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పార్టీ బలోపేతంపై దృష్టిసారించారు. ఇతర రాష్ట్రాల్లోనూ పాగా వేసేందుకు పావులు కదుపుతున్నారు. వచ్చే ఏడాది జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా ప్రత్యర్థులకు కొరకరాని కొయ్యగా మారాలని ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా చేరికలపై దృష్టిసారించారు.

పలువురు క్రీడాకారులు, సినీ నటులను టీఎంసీలోకి చేర్చుకుంటూ ఆ పార్టీకి గ్లామర్ తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల మాజీ టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్ ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా మాజీ క్రికెటర్, 1983లో ప్రపంచకప్ గెలిచిన భారత క్రికెట్ జట్టులోని సభ్యుడు అయిన కీర్తి ఆజాద్ టీఎంసీ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అయ్యారు.

బీహార్ మాజీ ముఖ్యమంత్రి భగవత్ ఆజాద్ కుమారుడైన కీర్తి ఆజాద్ దర్భంగా నుంచి మూడుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. తొలుత బీజేపీలో ఉన్న ఆయన  ఆ తర్వాత ఆ పార్టీని వీడి 2019లో కాంగ్రెస్‌లో చేరారు. అదే ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ధన్‌బాద్ నుంచి లోక్‌సభకు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇప్పుడు టీఎంసీలో చేరి అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. నేడు ఢిల్లీలో జరగనున్న కార్యక్రమంలో కీర్తి ఆజాద్ టీఎంసీ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది.
Congress
BJP
Team India
Kirti Azad
TMC

More Telugu News