సోషల్ మీడియా ప్రొఫైల్స్ నుంచి భర్త పేరును తొలగించిన ప్రియాంక చోప్రా.. విడిపోతున్నారా?

23-11-2021 Tue 08:17
  • ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల నుంచి ‘చోప్రాజొనాస్’ పేరును తొలగించిన ప్రియాంక
  • అవి చెత్తవార్తలంటూ కొట్టిపడేసిన ప్రియాంక తల్లి
  • కొత్త ప్రాజెక్టు కోసమేనన్న ప్రియాంక స్నేహితురాలు
Priyanka Chopra drops Jonas from name Hot topic in Bollywood
బాలీవుడ్ స్టార్ నటి ప్రియాంక చోప్రా- పాప్ సింగర్ నిక్ జొనాస్ విడిపోతున్నారంటూ బాలీవుడ్‌లో వార్తలు షికారు చేస్తున్నాయి. దీనికి కారణం కూడా ఉంది. ప్రియాంక తన ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల నుంచి ‘చోప్రాజొనాస్’ పేరును తొలగించడమే ఇందుకు కారణం. దీంతో ఇప్పుడు ప్రియాంక పేరుతోనే ఆమె ఖాతాలు దర్శనమిస్తున్నాయి. వీరిద్దరూ విడిపోతున్నారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. బాలీవుడ్‌లోనూ ఇప్పుడీ వార్త హాట్ టాపిక్ అయింది.

నెట్టింట్లో వైరల్ అవుతున్న ఈ వార్తలపై ప్రియాంక చోప్రా తల్లి మధు చోప్రా స్పందించారు. అవన్నీ చెత్త వార్తలని, ఉత్త పుకార్లు మాత్రమేనని స్పష్టం చేశారు. ప్రియాంక స్నేహితురాలు కూడా ఈ వార్తలను కొట్టిపడేశారు. భవిష్యత్తులో చేపట్టబోయే ప్రాజెక్టుల కోసమే ప్రియాంక తన పేరును ఇలా మార్చుకున్నారని వివరించారు. ప్రియాంక తన సోషల్ మీడియా ఖాతాల్లో ఒక్క జొనాస్ పేరును మాత్రమే తొలగించలేదని, ‘చోప్రా’ పేరును కూడా తొలగించిందని గుర్తు చేస్తున్నారు.

టాలీవుడ్ స్వీట్ కపుల్ సమంత-నాగచైతన్య విడిపోవడానికి ముందు కూడా సమంత తన సోషల్ మీడియా ఖాతాల నుంచి అక్కినేని పేరును తొలగించారు. ఇప్పుడు ప్రియాంక కూడా అదే పని చేయడంతో నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.