గెలిస్తే ఒక్కో మహిళకు నెలకు రూ.1000 ఇస్తాం... పంజాబ్ ఓటర్లకు గాలం వేస్తున్న కేజ్రీవాల్

22-11-2021 Mon 20:45
  • వచ్చే ఏడాది పంజాబ్ లో అసెంబ్లీ ఎన్నికలు
  • గెలుపుపై ధీమాతో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ
  • గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఓటమి
  • అయినప్పటికీ ప్రధాన ప్రతిపక్ష హోదా
  • గోవాలోనూ విస్తరణకు ఆప్ ప్రణాళికలు
Kejriwal announced if AAP wins they will give every woman thousand rupees
ఇతర రాష్ట్రాల్లోనూ పాగా వేసేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రణాళికలు రచిస్తోంది. వచ్చే ఏడాది పంజాబ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పటినుంచే సన్నద్ధమవుతోంది. తాజాగా ఈ అంశంపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పంజాబ్ లోని మోగాలో ఓ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ,  వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి పంజాబ్ లో ఆప్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

అంతేకాదు, తాము అధికారంలోకి వచ్చాక పంజాబ్ లో 18 ఏళ్లకు పైబడిన ప్రతి మహిళకు నెలకు రూ.1000 చొప్పున ఇస్తామని ప్రకటన చేశారు. రాష్ట్రంలో పెన్షన్లు అందుకుంటున్న మహిళలు ఈ రూ.1000లను కూడా అదనంగా అందుకోవచ్చని తెలిపారు. దాంతోపాటు ప్రతి ఇంటికి 300 యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇస్తామని హామీ గుప్పించారు. పైసా ఖర్చు లేకుండా వ్యాధులకు చికిత్స, ఔషధాలు అందజేస్తామని ప్రకటించారు.  

పంజాబ్ లో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఓటమిపాలైనప్పటికీ ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. ఇటీవల కాలంలో పంజాబ్ కాంగ్రెస్ లో నెలకొన్న సంక్షుభిత పరిస్థితులు తమకు అనుకూలిస్తాయని ఆప్ అధినాయకత్వం భావిస్తోంది. అటు, గోవాలోనూ ఆప్ విస్తరణకు కేజ్రీవాల్ వ్యూహరచన చేస్తున్నారు.