Ban Ki Moon: తన ఆత్మకథలో భారత్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఐరాస మాజీ ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్

Ban Ki Moon reveals his attachment with India in his autobiography
  • భారత్ లో కొరియా రాయబారిగా పనిచేసిన మూన్
  • జీవిత విశేషాలతో ఆత్మకథ
  • తన కుమారుడు భారత్ లోనే జన్మించాడని వెల్లడి
  • కుమార్తె భారతీయుడ్నే వివాహం చేసుకుందని వివరణ
ఐక్యరాజ్యసమితి మాజీ సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ రిసాల్వ్ డ్: యునైటింగ్ నేషన్స్ ఇన్ ఏ డివైడెడ్ వరల్డ్ పేరిట తన ఆత్మకథను రాశారు. దక్షిణ కొరియా జాతీయుడైన బాన్ కీ మూన్ తన ఆత్మకథలో భారతదేశం గురించి పలు ఆసక్తికర అంశాలను వెల్లడించారు. తన హృదయంలో సగభాగం భారతీయులకే చెందుతుందని పేర్కొన్నారు. దౌత్యాధికారిగా తన తొలి ఉద్యోగం భారత్ లోనే నిర్వర్తించానని వెల్లడించారు.  

తాను, తన అర్ధాంగి సూన్ టేక్ 1972లో ఢిల్లీ వచ్చామని, అక్కడే తాను మూడేళ్ల పాటు పనిచేశానని వివరించారు. తొలుత కొరియన్ కాన్సులేట్ జనరల్ లో వైస్ కాన్సుల్ గా పనిచేశానని తెలిపారు. 1973లో భారత్-కొరియా మధ్య పూర్తిస్థాయి దౌత్య సంబంధాలు ఏర్పడ్డాయని, ఆ సమయంలో కొరియా రాయబార కార్యాలయంలో సెకండ్ సెక్రటరీగా పనిచేశానని పేర్కొన్నారు.

భారత్ లో నా ఆస్తి, అప్పులు పట్టిక సమగ్రంగా ఉందని తాను భారతీయులతో చమత్కరిస్తుంటానని, అందుకు కారణం ఉందని తెలిపారు. తన కుమారుడు భారత్ లోనే జన్మించాడని, తన చిన్న కుమార్తె హ్యూన్ హీ ఓ భారతీయుడ్నే పెళ్లి చేసుకుందని బాన్ కీ మూన్ వివరించారు. భారత్ లో తన ప్రస్థానానికి 50 ఏళ్లు గడిచాయని, అందుకే తన హృదయంలో సగం భారతీయులకే చెందుతుందని చెబుతుంటానని పేర్కొన్నారు. కాగా, బాన్ కీ మూన్ ఆత్మకథను హార్పర్ కొలిన్స్ ఇండియా ముద్రణా సంస్థ ప్రచురించింది.
Ban Ki Moon
India
Autobiography
UN
South Korea

More Telugu News