ఇది ఇంటర్వెల్ మాత్రమేనన్న మంత్రి పెద్దిరెడ్డికి కన్నా లక్ష్మీనారాయణ కౌంటర్

22-11-2021 Mon 14:47
  • మూడు రాజధానుల బిల్లు ఉపసంహరించుకున్న సర్కారు
  • ఇది ఇంటర్వెల్ మాత్రమేనన్న మంత్రి పెద్దిరెడ్డి
  • ప్రభుత్వానికే ఇంటర్వెల్ పడుతుందన్న కన్నా
  • మూర్ఖత్వానికి పోవద్దని హితవు
Kanna Lakshminarayana counters minister Peddireddy comments on three capitals issue
ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకోవడం పట్ల మంత్రి పెద్దిరెడ్డి స్పందిస్తూ, ఇది ఇంటర్వెల్ మాత్రమేనని, ఇంకా శుభంకార్డు పడలేదని అన్నారు. మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యలకు ఏపీ బీజేపీ మాజీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ కౌంటర్ ఇచ్చారు. ఏపీకి మూడు రాజధానుల అంశంపై ప్రభుత్వం ఇంకా మూర్ఖత్వానికి పోతున్నట్టుగా కనిపిస్తోందని, అదే జరిగితే ప్రభుత్వానికి ఇంటర్వెల్ పడుతుందని స్పష్టం చేశారు. ప్రజలే ప్రభుత్వానికి ఇంటర్వెల్ ఇస్తారని వ్యాఖ్యానించారు.

మూడు రాజధానుల నిర్ణయం అహంకారపూరితంగా తీసుకున్నదని, దీన్ని వెనక్కి తీసుకోక తప్పదని తాను గతంలోనే చెప్పానని కన్నా వెల్లడించారు. ఇవాళ అదే జరిగిందని అన్నారు. రాష్ట్ర రాజధాని అంశం ఇష్టం వచ్చినట్టు తీసుకునేది కాదని, ఏపీకి రాజధాని ఏదనేది ఎప్పుడో నిర్ణయం జరిగిపోయిందని స్పష్టం చేశారు. ఎంతో ప్రజాధనాన్ని రాజధానిపై వెచ్చించారని, ముఖ్యంగా 30 వేల మందికి పైగా రైతులు తమ భూములు ఇచ్చారని వివరించారు. కానీ ప్రభుత్వం మారిన తర్వాత రాజధాని తన ఇష్టం వచ్చినచోట, తనకు నచ్చినచోట పెట్టుకుంటానని ముఖ్యమంత్రి అనడం సబబు కాదని పేర్కొన్నారు.