Andhra Pradesh: మూడు రాజధానుల చట్టం ఉపసంహరణపై స్పష్టత కోరిన హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం

  • మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న ఏపీ ప్రభుత్వం
  • చట్టాలను వెనక్కి తీసుకున్నట్టు హైకోర్టుకు తెలిపిన అడ్వొకేట్ జనరల్
  • సీఎం జగన్ ఈ అంశంపై అసెంబ్లీలో ప్రకటన చేస్తారని వెల్లడి
AP High Court asks for clarity on withdrawal of 3 capitals

రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు బిల్లులను ఏపీ ప్రభుత్వం రద్దు చేసిందని ఏపీ హైకోర్టుకు అడ్వొకేట్ జనరల్ తెలిపారు. ఈ మేరకు హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. కాసేపటి క్రితం ఏపీ కేబినెట్ అత్యవసరంగా సమావేశమైందని... ఈ సమావేశంలో మూడు రాజధానులపై తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకుందని కోర్టుకు తెలిపారు. ఈ చట్టాల రద్దుపై ముఖ్యమంత్రి జగన్ కాసేపట్లో అసెంబ్లీలో ప్రకటన చేస్తారని చెప్పారు. అయితే చట్టాల ఉపసంహరణ అంశాన్ని పూర్తి స్పష్టతతో చెప్పాలని ధర్మాసనం చెప్పింది. తదుపరి విచారణను మధ్యాహ్నం 2.15 గంటలకు వాయిదా వేసింది.  

అమరావతికి సంబంధించి దాఖలైన 90కి పైగా పిటిషన్లపై ఏపీ హైకోర్టు రోజువారీ విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. త్రిసభ్య ధర్మాసనం ఈ విచారణ చేపట్టింది. కేసు విచారణలో భాగంగా రైతులు, ప్రభుత్వ తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తున్నారు.

కాసేపట్లో అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్ ఈ అంశంపై మాట్లాడనున్నారు. రాజధాని అంశంపై ఆయన ఎలాంటి ప్రకటన చేస్తారనే ఉత్కంఠ సర్వత్ర నెలకొంది. ఈరోజు సభలో ప్రవేశపెట్టబోయే బిల్లులో ఏం ఉండబోతోందనే ఆసక్తి నెలకొంది.

More Telugu News