మహేశ్ కి విలన్ గా విక్రమ్ ను సెట్ చేసిన రాజమౌళి?

22-11-2021 Mon 09:53
  • ముగింపు దశలో 'సర్కారువారి పాట'
  • త్వరలో రాజమౌళి ప్రాజెక్టుపైకి మహేశ్
  • దక్షిణాఫ్రికా నేపథ్యంలో నడిచే కథ
  • విల్బర్ స్మిత్ పుస్తకం ఆధారంగా కథ  
Vikram in Rajamouli Movie
మహేశ్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో 'సర్కారువారి పాట' సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. కీర్తి సురేశ్ కథానాయికగా నటించిన ఈ సినిమాను, ఏప్రిల్ 1వ తేదీన భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ సినిమాకి మహేశ్ కూడా ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

ఆ తరువాత సినిమాను ఆయన రాజమౌళి దర్శకత్వంలో చేయనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు మొదలైపోయాయి. ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రకిగాను సీనియర్ స్టార్ హీరో విక్రమ్ ను ఎంపిక చేయనున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది. దక్షిణాఫ్రికా నేపథ్యంలో అడ్వెంచర్ థ్రిల్లర్ గా ఈ సినిమా రూపొందనుందని అంటున్నారు.

ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, దక్షిణాఫ్రికా నవలా రచయిత విల్బర్ స్మిత్ కి తాను పెద్ద అభిమానినని చెప్పాడు. ఆయన రాసిన ఒక పుస్తకం ఆధారంగా తాను ఒక కథ సిద్ధం చేయాలనుకుంటున్నట్టుగా చెప్పారు. బహుశా ఈ కథ అలా అక్కడి నుంచి వచ్చినదే అయ్యుంటుందని చెప్పుకుంటున్నారు.