నందమూరి కుటుంబం అంటే మాకూ అభిమానమే: కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి

22-11-2021 Mon 09:32
  • అసెంబ్లీలో జరిగింది వేరు.. బయట జరుగుతున్న ప్రచారం వేరు
  • భువనేశ్వరి అంటే మాకూ అభిమానమే
  • అవగాహన లేకపోవడం వల్లే ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు అలా మాట్లాడుతున్నారు
  • త్వరలోనే రికార్డులు బయటపెడతాం
We did not say anything about Nara Bhuvaneswari said dwarampudi
ప్రతిపక్ష నేత చంద్రబాబు భార్య భువనేశ్వరిని తామేమీ అనలేదని, బాబే ఆమెను రాజకీయాల్లోకి లాగుతున్నారని కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న విశాఖపట్టణంలో జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. నందమూరి కుటుంబం అంటే తమకూ ఎనలేని గౌరవం ఉందన్నారు. ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరిని తాము గౌరవిస్తామన్నారు.

అయితే, ఆ రోజు సభలో జరిగింది వేరని, బయట జరుగుతున్న ప్రచారం వేరని అన్నారు. సభలో భువనేశ్వరిని ఎవరూ ఏమీ అనలేదని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు అవగాహన లేకపోవడం వల్లే అలా మాట్లాడుతున్నారని అన్నారు. అసెంబ్లీలో ఎవరేం మాట్లాడారో రికార్డులు బయటపెడతామని, అప్పుడు అందరి బండారం బయటపడుతుందని ద్వారంపూడి అన్నారు.