భార్య ప్రేమకు బందీ.. తాజ్‌మహల్‌ను పోలిన ఇంటిని కట్టించేసి గిఫ్ట్‌గా ఇచ్చిన భర్త!

22-11-2021 Mon 09:19
  • మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్‌లో ఘటన
  • నిర్మాణానికి మూడేళ్లు
  • నాలుగు బెడ్రూములు, హాలు, లైబ్రరీ, ధ్యాన మందిరం
  • తాజ్‌మహల్‌లా చీకట్లోనూ మెరుస్తున్న ‘తాజ్‌మహల్ ఇల్లు’
MP man gifts Taj Mahal like home to wife
ప్రేమకు చిహ్నం తాజ్‌మహల్. ప్రేమికులకు దానిని ఇవ్వడానికి మించి బహుమానం ఏముంటుంది? భార్య ప్రేమలో బందీ అయిన ఓ భర్త ఇదే పనిచేశాడు. తాజ్‌మహల్‌ను పోలిన ఇంటిని కట్టించి భార్యకు కానుకగా ఇచ్చాడు. అది చూసిన ఆమె సంభ్రమాశ్చర్యాలకు గురైంది. ఆమె ఒక్కరే కాదు.. ఆ ఇంటిని చూసిన ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు. మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్‌లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అయింది.

షాజహాన్ భార్య ముంతాజ్ బుర్హాన్‌పూర్‌లోనే మరణించారు. దీంతో తొలుత తపతి నది ఒడ్డున తాజ్‌మహల్‌ను నిర్మించాలని అనుకున్నారు. అయితే, ఆ తర్వాత ఆగ్రాలో దానిని నిర్మించారు. అదే గ్రామానికి చెందిన ఆనంద్ చోక్సీ ఇదే విషయాన్ని ఆలోచించాడు. ఆ పనేదో తానే చేయాలని నిర్ణయించుకున్నాడు. తాజ్‌మహల్‌ లాంటి ఇంటిని నిర్మించి తన భార్యకు బహుమానంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా ఇంజినీర్‌ను కలిసి విషయం చెప్పాడు.

అలా మొగ్గ తొడిగిన ఆ ఆలోచన కార్యరూపం దాల్చడానికి మూడేళ్లు పట్టింది. దీని నిర్మాణంలో పలు సవాళ్లు ఎదురైనట్టు దానిని నిర్మించిన ఇంజినీర్ చెప్పుకొచ్చారు. ఇంటి లోపలి ఆకృతలను తీర్చిదిద్దేందుకు బెంగాల్, ఇండోర్ నుంచి కళాకారులను పిలిపించాల్సి వచ్చిందన్నారు. ఇంటి డోమ్ 29 అడుగుల ఎత్తు అని, తాజ్‌మహల్‌ను పోలిన టవర్లు ఏర్పాటు చేశామని, రాజస్థాన్‌ నుంచి తెప్పించిన ‘మక్రానా’తో ఫ్లోరింగ్ చేయించినట్టు వివరించారు. ఇంటిలోని ఫర్నిచర్‌ను ముంబై కళాకారులు తీర్చిదిద్దినట్టు తెలిపారు.

పెద్ద హాలు, పైన రెండు, కింద రెండు బెడ్రూములు, లైబ్రరీ, ధ్యానం కోసం ఓ గదిని నిర్మించారు. అంతేకాదు, తాజ్‌మహల్‌ లానే చీకటిలోనూ  ఈ ఇల్లు వెలుగులు విరజిమ్ముతుండడం మరో విశేషం. అందంగా, అద్భుతంగా నిర్మించిన ఈ తాజ్‌మహల్ ఇంటిని తన భార్యకు కానుకగా ఇవ్వడంతో ఆమె ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. ఇప్పుడీ తాజ్‌మహల్ ఇల్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.