Shakti EW: 'శక్తి ఈడబ్ల్యూ'... ఈ భారత శక్తిని దాటుకుని ఇంకే శక్తీ రాలేదు!

  • శక్తి ఈడబ్ల్యూను అభివృద్ధి చేసిన డీఆర్ డీఓ 
  • శక్తిని నేవీకి అప్పగించిన ప్రధాని మోదీ
  • కీలక యుద్ధ నౌకలపై శక్తిని మోహరించినున్న నేవీ
  • దేశానికి రక్షణ ఛత్రం వంటిది శక్తి
PM Modi handed over Shakti EW Suite to Indian Navy

గతంతో పోల్చితే భారత ఆయుధ సంపత్తి గణనీయంగా పెరిగింది. సంఖ్యా పరంగానే కాదు, నాణ్యత, సామర్థ్యం పరంగానూ భారత్ అగ్రరాజ్యాలకు దీటుగా అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానాన్ని సొంతం చేసుకుంది. ఇందులో డీఆర్ డీఓ (డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్) పాత్ర ఎనలేనిది. స్వావలంబన దిశగా భారత్ ఎదగడంలో ఈ సంస్థదే ముఖ్యభూమిక.

భారత్ తమకు పోటీగా వస్తుందన్న కారణంతో కొన్ని అగ్రదేశాలు కీలక సాంకేతిక పరిజ్ఞానాన్ని నిరాకరించినా, డీఆర్ డీఓ శాస్త్రవేత్తలు అహరహం శ్రమించి దేశానికి శత్రుభీకర ఆయుధాలను అందించేందుకు కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో ఉద్భవించిందే 'శక్తి ఈడబ్ల్యూ'. ఈడబ్ల్యూ అంటే 'ఎలక్ట్రానిక్ వార్ ఫేర్'. భవిష్యత్ యుద్ధాల్లో ఎలక్ట్రానిక్ వ్యవస్థలదే హవా అని రక్షణ రంగ నిపుణులు అంచనా వేస్తున్న నేపథ్యంలో భారత్ కూడా ఆ దిశగా ముందడుగు వేసింది. 'శక్తి' పేరిట స్వీయ రక్షణ ఛత్రాన్ని నిర్మించకుంది.

తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ  ఈ 'శక్తి ఎలక్ట్రానిక్ వార్ ఫేర్ సిస్టమ్' ను నేవీకి అప్పగించారు. భారత అమ్ములపొదిలో ఉన్న భారీ యుద్ధ నౌకలకు ఇది శ్రీరామరక్ష వంటిది. ఒక్కసారి 'శక్తి ఈడబ్ల్యూ' పని ప్రారంభిస్తే ఏ మిస్సైల్ కానీ, ఏ యుద్ధ విమానం కానీ మనవైపుకు దూసుకురాలేదు. ఇదెలాగో తెలుసుకోవాలంటే ముందు 'శక్తి ఈడబ్ల్యూ' పనితీరు గురించి తెలుసుకోవాలి.

ఇది ప్రధానంగా గుర్తించడం, వర్గీకరించడం, అడ్డుకోవడం లేదా జామ్ చేయడం అనే అంశాల ప్రాతిపదికన పనిచేస్తుంది. ఏదైనా శత్రు దేశ మిసైల్ భారత్ పైకి దూసుకొస్తే 'శక్తి ఈడబ్ల్యూ'లోని రాడార్లు గుర్తిస్తాయి. ఆ రాడార్లకు అనుసంధానం చేసిన పవర్ ఫుల్ కంప్యూటర్లు ఆ శత్రు మిసైల్  శక్తిసామర్థ్యాలను విశ్లేషిస్తాయి. దాన్ని ఎంత ఎత్తులో అడ్డుకోవాలో 'శక్తి ఈడబ్ల్యూ' వ్యవస్థలో భాగంగా ఉండే క్షిపణులకు నిర్దేశిస్తాయి. అంతే... శత్రుదేశపు మిసైల్ భారత భూభాగంపై విధ్వంసం సృష్టించకముందే గాల్లోనే తుత్తునియలు అవుతుంది.
అంతేకాదు, శత్రుదేశపు రాడార్లు, యుద్ధ విమానాల సిగ్నల్స్ ను శక్తి ఈడబ్ల్యూ సమర్థవంతంగా జామ్ చేయగలదు. తద్వారా భారత గడ్డపై ఈగ కూడా వాలలేదు. దేశంలోని కీలక నగరాలు, ప్రాంతాలపై కంటికి కనిపించని ఒక ఎలక్ట్రానిక్ కవచం ఉంటుందన్నమాట.
డీఆర్ డీఓ ఇప్పటివరకు 12 శక్తి సిస్టమ్స్ ను అభివృద్ధి చేయగా, వాటిని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ తయారుచేస్తోంది. తాజాగా ప్రధాని మోదీ నేవీకి ఈ వ్యవస్థలను అందించగా, వాటిని కీలక యుద్ధ నౌకలపై మోహరించనున్నారు. తద్వారా భారత విమాన వాహక నౌకలు, యుద్ధ నౌకలు శత్రుదుర్భేద్యం కానున్నాయి.

More Telugu News