క్షమాపణలు తెలిపిన 'జై భీమ్' దర్శకుడు జ్ఞానవేల్

21-11-2021 Sun 19:25
  • సూర్య హీరోగా జై భీమ్ చిత్రం
  • వన్నియార్ కులాన్ని కించపరిచేలా ఉందంటూ ఆరోపణలు
  • చిత్రంపై పట్టాళి మక్కళ్ కట్చి తీవ్ర ఆగ్రహం
  • వివరణ ఇచ్చిన జ్ఞానవేల్
Jai Bheem director Jnanavel apologizes
ఇటీవల విడుదలైన జై భీమ్ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. సూర్య హీరోగా తెరకెక్కిన ఈ చిత్రంలో కొన్ని సీన్లు వన్నియార్ కులాన్ని కించపరిచేలా ఉన్నాయంటూ పట్టాళి మక్కల్ కట్చి (పీఎంకే) పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో జై భీమ్ చిత్ర దర్శకుడు టీజే జ్ఞానవేల్ స్పందించారు. తమ చిత్రంపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో క్షమాపణలు తెలుపుతున్నట్టు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఏ కులాన్ని, ఏ వ్యక్తిని కించపరిచే ఉద్దేశంతో తాము సినిమా తీయలేదని స్పష్టం చేశారు. ఎవరికైనా జై భీమ్ చిత్రంతో ఇబ్బంది కలిగితే మన్నించాలని కోరారు.

ఈ వివాదానికి హీరో సూర్య బాధ్యత వహించాలనడం సబబు కాదని జ్ఞానవేల్ స్పష్టం చేశారు. సూర్య ఓ నిర్మాతగా, నటుడిగా జై భీమ్ చిత్రం ద్వారా ఓ గిరిజన తెగ ఎదుర్కొన్న సమస్యలను వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేశారని, ఇప్పుడు అకారణంగా విమర్శలు ఎదుర్కొంటున్నారని జ్ఞానవేల్ వ్యాఖ్యానించారు. ఇలాంటి వివాదం వచ్చినందుకు సూర్యను కూడా క్షమించమని కోరతానని వెల్లడించారు.