పాన్ మసాలా సంస్థకు లీగల్ నోటీసులు పంపిన అమితాబ్

21-11-2021 Sun 14:17
  • తప్పుకొన్నా ప్రకటన ప్రసారం చేయడంపై అభ్యంతరం
  • కొన్ని రోజులకే ఒప్పందం రద్దు చేసుకున్న బిగ్ బీ
  • డబ్బు కూడా తిరిగిచ్చేసిన మెగాస్టార్
  • అయినా ప్రకటనను ప్రసారం చేస్తున్న సంస్థ
Amitabh Sends Legal Notices To Pan Masala Brand
పాన్ మసాలా బ్రాండ్ కు బాలీవుడ్ మెగాస్టార్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ లీగల్ నోటీసులు పంపారు. ఇటీవల కమలా పసంద్ అనే పాన్ మసాలా బ్రాండ్ లో అమితాబ్ బచ్చన్ నటించిన సంగతి తెలిసిందే. అయితే, ఓ పెద్ద స్టార్ ఇలాంటి ప్రకటనల్లో నటించి.. యువతకు చెడు దారిని చూపుతారా? అంటూ విమర్శలు వెల్లువెత్తడం, వెంటనే ప్రకటన నుంచి వైదొలగాలన్న విజ్ఞప్తులు రావాడంతో బిగ్ బీ ఆ ప్రకటన నుంచి తప్పుకొన్నారు. సంస్థతో కాంట్రాక్ట్ రద్దు చేసుకుని.. తీసుకున్న డబ్బునూ వాపస్ ఇచ్చేశారు.

అయితే, కాంట్రాక్ట్ రద్దయినా ఇప్పటికీ పలు టీవీల్లో అమితాబ్ నటించిన ప్రకటనను ప్రసారం చేస్తున్నారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన అమితాబ్.. సదరు సంస్థకు లీగల్ నోటీసులు పంపించారు. తాను కాంట్రాక్ట్ రద్దు చేసుకున్నా తాను ప్రమోట్ చేస్తున్నట్టుగా ప్రకటనను ప్రసారం చేయడాన్ని నిలిపేయాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

‘‘కొన్ని రోజులకే పాన్ మసాలా బ్రాండ్ ప్రకటన నుంచి తప్పుకొన్నారు. అది సర్రోగేట్‌ అడ్వర్టైజింగ్ కిందకు వస్తుందని ఒప్పందం చేసుకునేటప్పుడు అమితాబ్ కు తెలియదు. ఆ వెంటనే ఒప్పందం రద్దు చేసుకున్నారు. డబ్బు తిరిగిచ్చేశారు’’ అని అమితాబ్ కార్యాలయం పేర్కొంది.