Andhra Pradesh: దిగజారిన మనుషులు ఏవైనా మాట్లాడుతారు.. తొలిసారి స్పందించిన నారా భువనేశ్వరి!

Nara Bhuvaneshwari First Response On Assembly Incidents
  • చంద్రబాబును అనునయించిన ఆయన సతీమణి
  • మనసులో పెట్టుకోవద్దంటూ భర్తకు సూచన
  • ఎన్టీఆర్ హయాంలోనూ ఇలాంటివారున్నారని ఆవేదన
అసెంబ్లీలో పరిణామాల తర్వాత.. మీడియా సమావేశంలో చంద్రబాబు వెక్కివెక్కి ఏడ్చిన సంగతి తెలిసిందే. తన భార్యపై అసభ్యంగా మాట్లాడారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ సీఎం అయ్యే దాకా అసెంబ్లీలో అడుగు పెట్టనంటూ ప్రతినబూనారు. ఆ ఘటనపై నందమూరి ఫ్యామిలీ మొత్తం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఖబడ్దార్ అంటూ బాలకృష్ణ వైసీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, నారా రోహిత్ సహా అందరూ పెదవి విప్పారు.

అందరూ స్పందించినా చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మాత్రం ఇప్పటిదాకా ఈ వ్యవహారంపై స్పందించలేదు. తాజాగా ఆమె తన భావాలను వ్యక్తీకరించినట్టు తెలుస్తోంది. బాబు ఏడ్వడాన్ని చూసి భువనేశ్వరి కూడా ఇంట్లో భోరున విలపించారని సమాచారం. ఈ క్రమంలోనే ప్రెస్ మీట్ అవ్వగానే ఇంటికి వెళ్లిన చంద్రబాబు, నారా లోకేశ్ ను చూసి ఆమె మరింత ఏడ్చారని అంటున్నారు. ఆ తర్వాత వెంటనే కోలుకున్న ఆమె.. జరిగిన దాని గురించి ఎక్కువగా ఆలోచించవద్దంటూ తన భర్తకు చెప్పినట్టు సమాచారం.

‘‘దిగజారిన మనుషులు ఏవైనా మాట్లాడతారు. అవన్నీ మనసులో పెట్టుకోవద్దు.. వదిలేయండి. రాజకీయాల్లో ఒక్కోసారి ఇలాంటి వ్యక్తులను ఎదుర్కోవాల్సి వస్తుంది. నాన్నగారి హయాంలోనూ కొందరు అలాగే మాట్లాడేవారున్నారు. చాలా నీచంగా మాట్లాడారు. బాధపెట్టడానికే ఇలాంటివి మాట్లాడుతారు. మనసుకు బాధనిపిస్తుంది. అలాంటి వాటిని పట్టించుకోవద్దు. పక్కకు పడేసి మన పని మనం చేసుకుపోవాలి’’ అంటూ ఆమె భర్తను అనునయించారని తెలుస్తోంది.
Andhra Pradesh
Telugudesam
Andhra Pradesh Assembly
Chandrababu
Nara Bhuvaneswari

More Telugu News