మేం రిస్క్​ చేసి పనిచేస్తేనే మీ ఆస్తులొచ్చాయ్.. ‘తిరిగిచ్చేయాలంటూ’ 20 దేశాల్లో అమెజాన్ ఉద్యోగుల ధర్నా

21-11-2021 Sun 13:19
  • నవంబర్ 26న ‘బ్లాక్ ఫ్రైడే’ నిరసనలు
  • వేతనాలు పెంచాలంటూ డిమాండ్
  • పని వేళలను సవరించాలని విజ్ఞప్తులు
  • ఉద్యోగులు, 70 స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ‘మేక్ అమెజాన్ పే’ ఉద్యమం
Amazon Workers In 20 Countries To Enter Strike On Black Friday
అమెజాన్ సంస్థ బాస్, ప్రపంచ కుబేరుడు జెఫ్ బెజోస్ పై ఆ సంస్థ ఉద్యోగులు మండిపడుతున్నారు. ఎక్కువ పని చేయించుకుంటూ తక్కువ జీతం ఇస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము పనిచేస్తేనే ఆయన అన్ని ఆస్తులు కూడగట్టుకున్నారని, తాము చేసిన పనికి మాత్రం తగిన ప్రతిఫలం ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందుకే వేతనాలు పెంచేలా, పని వేళలను కుదించేలా తమ బాస్ పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నెల 26న ‘బ్లాక్ ఫ్రైడే’ నిరసనలకు పిలుపునిచ్చారు.

20 దేశాల్లో ఉద్యోగులు స్ట్రైక్ కు దిగనున్నారు. ఆక్స్ ఫాం, గ్రీన్ పీస్, అమెజాన్ వర్కర్స్ ఇంటర్నేషనల్ అనే 70 సంస్థలు కలిసి ‘మేక్ అమెజాన్ పే’ అనే ఉద్యమాన్ని నడుపుతున్నాయి. అందులో భాగంగా అమెజాన్ వేర్ హౌస్ ల నుంచి ఆయిల్ రిఫైనరీస్ దాకా అన్ని సంస్థల్లోని ఉద్యోగులు నిరసనల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

‘‘కరోనా మహమ్మారి కాలంలో అందరూ ఆర్థికంగా చితికిపోతే.. అమెజాన్ మాత్రం ఆస్తులను కూడగట్టింది. భారీ లాభాలను ఆర్జించినా ఉద్యోగులకు ఇచ్చింది మాత్రం చాలా తక్కువ. అందుకే ఉద్యోగులకు ఇచ్చేందుకు అమెజాన్ కు సమయం ఆసన్నమైంది’’ అంటూ మేక్ అమెజాన్ పే ఉద్యమకారులు పేర్కొన్నారు. సమాజానికి తిరిగిచ్చేయాల్సిన టైం వచ్చిందన్నారు.

ఇప్పటికే సంస్థలో పని పరిస్థితులపై చాన్నాళ్లుగా నిరసన గళాలు వినిపిస్తున్నాయి. ఎక్కువ గంటలు పనిచేయాల్సి రావడం, తక్కువ వేతనాలు, ఫెర్ఫార్మెన్స్ పై సమీక్ష వంటి వ్యవహారాల్లో అమెజాన్ తీరు సరిగ్గా లేదని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వేతనాలు పెంచడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించి ఉద్యోగులపై నిఘా వేయడాన్ని మానుకోవాలని సూచిస్తున్నారు. అంతేగాకుండా సమాచార గోప్యతలో పారదర్శకతను పాటించాల్సిన అవసరం ఉందన్నారు. సంస్థాగతంగా జాత్యాంహకార ధోరణి కలిగి ఉన్న పోలీసు బలగాలు, వలసవిధాన విభాగ అధికారులతో భాగస్వామ్యాన్ని తెంచుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

సంస్థలో ఉద్యోగ సంఘాలపై అమెజాన్ నిషేధం విధించిందన్న ఆరోపణల నేపథ్యంలో.. ఉద్యోగ సంఘాలకు అనుమతివ్వాలని మేక్ అమెజాన్ పే ఉద్యమకారులు డిమాండ్ చేస్తున్నారు. అంతేగాకుండా.. సంస్థ పన్నులను ఎగవేస్తోందని ఆరోపించారు. 2006 నుంచి 2018 మధ్య బెజోస్ పన్నులు ఎగవేశారని ‘ప్రో పబ్లికా’ అనే సంస్థ నివేదిక వెల్లడించిన నేపథ్యంలో.. పన్నులను కట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

కరోనా మహమ్మారి సమయంలో సంస్థ లక్ష కోట్ల డాలర్ల కంపెనీగా ఎదిగిందని, వ్యక్తిగత ఆస్తుల విషయంలో 20 వేల కోట్ల డాలర్ల సంపద కలిగిన మొట్టమొదటి వ్యక్తిగా జెఫ్ బెజోస్ అవతరించారని తెలిపారు. కానీ, ఆ సమయంలో తమ ప్రాణాలను పణంగా పెట్టి.. సంస్థ ఆస్తులు పెరిగేందుకు కారణమైన ఉద్యోగులను మాత్రం ఆయన పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, గత ఏడాదిలో మేక్ అమెజాన్ పేను నెలకొల్పారు. అప్పటి నుంచి అదే వేదికగా ఎన్నెన్నో ఉద్యమాలను ఉద్యోగులు నిర్వహించారు.