చల్లగాలి కోసం కారు నుంచి తల బయపెట్టి.. ప్రాణాలు కోల్పోయిన యువతి

21-11-2021 Sun 08:46
  • స్నేహితురాలి వివాహం కోసం రావులపాలెం వచ్చిన స్నేహితులు
  • మారేడుమిల్లి విహారయాత్రకు కారులో బయలుదేరిన వైనం
  • రోడ్డు పక్కన స్తంభం తాకి యువతి మృతి
Young Girl Died after her her Collided with road side pole
కారులో ప్రయాణిస్తూ చల్లగాలి కోసం తల బయటపెట్టిన ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. తూర్పుగోదావరి జిల్లాలో జరిగిందీ ఘటన. వేర్వేరు ప్రాంతాలకు చెందిన ఎనిమిదిమంది రావులపాలెంలో జరిగే స్నేహితురాలి వివాహానికి వచ్చారు. ఈ క్రమంలో నిన్న వీరందరూ కలిసి పశ్చిమ గోదావరి జిల్లా గౌరీపట్నం నుంచి కారులో మారేడుమిల్లి విహారయాత్రకు బయలుదేరారు.

మధురపూడి విమానాశ్రయం గేటు-బూరుగుపూడి గ్రామం మధ్య ప్రయాణిస్తున్న సమయంలో వీరిలో వల్లభనేని లోహిత్ రాణి (25) చల్లగాలి కోసం కిటికీ తెరిచి తల బయట పెట్టారు. అదే సమయంలో కారు రోడ్డు పక్కకు దిగడంతో విద్యుత్ స్తంభం ఆమె తలకు బలంగా తాకింది.

తీవ్రగాయాలపాలైన రాణిని అదే కారులో రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆమె మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. రాణి సహా ఆరుగురు చెన్నైలో సీఏలుగా పనిచేస్తుండగా, మరో ఇద్దరు బీటెక్ పూర్తి చేసి ఉద్యోగాన్వేషణలో ఉన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.