దాన్నసలు ఏడుపు అంటారా?: లక్ష్మీపార్వతి వ్యంగ్యం

  • అసెంబ్లీలో అవమానం జరిగిందన్న చంద్రబాబు
  • తన అర్ధాంగిని తిట్టారని ఆరోపణ
  • ఘాటుగా స్పందించిన లక్ష్మీపార్వతి
  • నందమూరి కుటుంబాన్ని మోసం చేస్తున్నాడని వెల్లడి
Lakshmi Parvathi satires on Chandrabau

తన అర్ధాంగి భువనేశ్వరిని అసెంబ్లీలో వైసీపీ నేతలు దూషించారని చంద్రబాబు తీవ్ర ఆరోపణలు చేస్తుండడం పట్ల వైసీపీ మహిళా నేత, తెలుగు అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి ఘాటు వ్యాఖ్యలు చేశారు. గతంలో ఎన్టీఆర్ ను మోసం చేసినట్టే ఇప్పుడు నందమూరి కుటుంబ సభ్యులను కూడా చంద్రబాబు మోసం చేస్తున్నాడని విమర్శించారు. చంద్రబాబు యథావిధిగా కుటుంబానికి అబద్ధం చెప్పాడని ఆరోపించారు.

అసెంబ్లీలో ఏమీ జరగకపోయినా, టీడీపీ నేతలు మసిపూసి మారేడుకాయ చేస్తున్నారని, కన్నీళ్లు పెట్టుకుని చంద్రబాబు పెద్ద సీన్ క్రియేట్ చేశాడని లక్ష్మీపార్వతి వ్యాఖ్యానించారు. దాన్నసలు ఏడుపు అంటారా...? అని వ్యంగ్యం ప్రదర్శించారు. అదంతా వట్టి నాటకమేనని, ఈ విషయాన్ని బాలకృష్ణ గుర్తించాలని అన్నారు. ఎన్టీఆర్ వంటి మహనీయుడి కడుపున పుట్టి, చంద్రబాబు చెప్పిన మాటలను మూర్ఖంగా ఎలా నమ్ముతున్నారని ప్రశ్నించారు.

25 ఏళ్లుగా దాచిన ఓ నిజాన్ని ఇప్పుడు చెబుతున్నా!

బాలయ్య బాబుతో తనకు ఎంతో అనుబంధం ఉందని లక్ష్మీపార్వతి ఈ సందర్భంగా వెల్లడించారు. పాతికేళ్లుగా దాచిన ఓ నిజాన్ని ఇప్పుడు వెల్లడిస్తున్నానని చెప్పారు. "బాలయ్య బాబూ... మీ నాన్న గారు మరణించిన తర్వాత చంద్రబాబు వచ్చాడు. మీకెంత డబ్బు కావాలో చెప్పండి ఇస్తాను. మీ అబ్బాయిని తీసుకుని విదేశాలకు వెళ్లండి అని అన్నాడు. ఆ నిజాన్ని ఇప్పటివరకు ఎవరికీ చెప్పలేదు. చంద్రబాబు దుర్మార్గం గురించి మీ నాన్న గారు ఎంతో మనోవేదనకు గురయ్యారు. ఇప్పటికైనా చంద్రబాబును నందమూరి కుటుంబం దూరంగా ఉంచాలి" అని లక్ష్మీపార్వతి సూచించారు.

More Telugu News