రైతుల ఉద్యమంలో అమరులైన వారి కుటుంబాలకు రూ.3 లక్షల చొప్పున సాయం ప్రకటించిన సీఎం కేసీఆర్

20-11-2021 Sat 19:39
  • సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఉద్యమం
  • 750 మంది వరకు రైతులు ప్రాణాలు కోల్పోయారన్న సీఎం కేసీఆర్
  • వారి కుటుంబాలకు కేంద్రం రూ.25 లక్షల చొప్పున ఇవ్వాలని డిమాండ్
  • రైతులపై కేసులు ఎత్తివేయాలని స్పష్టీకరణ
CM KCR tells TS Govt will convey financial help to farmers families
ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్రంపై పోరాటం షురూ చేసిన తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. జాతీయ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమించిన రైతుల విషయంలో కేంద్రం వైఖరి దుర్మార్గమని పేర్కొన్నారు. వ్యవసాయ చట్టాల కోసం ఉద్యమించిన రైతుల్లో 750 మంది వరకు రైతులు మరణించారని, వారి కుటుంబాలను కేంద్రం ఆదుకోవాలని అన్నారు.

ఉద్యమంలో మరణించిన రైతులకు తెలంగాణ ప్రభుత్వం తరఫున రూ.3 లక్షల చొప్పున సాయం అందిస్తామని, కేంద్రం ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షలు నష్టపరిహారంగా అందించాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. ఉద్యమ సమయంలో రైతులపై వేల సంఖ్యలో కేసులు నమోదు చేశారని, రైతులకు మద్దతు తెలిపిన అమాయకులపైనా కేసులు పెట్టారని ఆరోపించారు. ఆ కేసులన్నింటిని ఎత్తివేయాలని అన్నారు.

ధాన్యం కొనుగోలు అంశంపై స్పందిస్తూ, బాయిల్డ్ రైస్ కొనుగోలుపై కేంద్రం స్పష్టత ఇవ్వాలన్నారు. బాయిల్డ్ రైస్ ను కేంద్రం కొనబోవడంలేదంటూ ప్రచారం జరుగుతోందని, అందులో నిజమెంతో వెల్లడి కావాల్సి ఉందని పేర్కొన్నారు.