ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ సంబంధిత నేరాలకు పాల్పడినట్టు ఎలాంటి ఆధారాల్లేవు: బాంబే హైకోర్టు స్పష్టీకరణ

20-11-2021 Sat 19:24
  • ఆర్యన్ ఖాన్ కు మరోసారి కోర్టులో ఊరట
  • వాంగ్మూలాలు చెల్లవన్న బాంబే హైకోర్టు
  • చాటింగుల్లో అభ్యంతరకర అంశాలు లేవని వెల్లడి
  • నేరానికి పాల్పడినట్టు ఒక్క బలమైన ఆధారం లేదని వివరణ
Bombay High Court says no positive evidence against Aryan Khan and others
ముంబయి క్రూయిజ్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన ఆర్యన్ ఖాన్ కు బాంబే హైకోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ సంబంధిత నేరాలకు పాల్పడినట్టు ఎలాంటి సానుకూల ఆధారాలు లేవని న్యాయస్థానం స్పష్టం చేసింది. అరెస్టయిన సమయంలో ఇచ్చిన వాంగ్మూలాలు చెల్లుబాటు కావని హైకోర్టు ఈ రోజు విడుదల చేసిన బెయిల్  ఆర్డర్ లో తేల్చి చెప్పింది.

అక్టోబరు 3న ముంబయి సముద్ర తీరంలో ఓ క్రూయిజ్ నౌకలో జరుగుతున్న పార్టీని భగ్నం చేసిన ఎన్సీబీ అధికారులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ఉండడం సంచలనం సృష్టించింది. ఈ కేసులో రెండు పర్యాయాలు ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్లు తిరస్కరణకు గురి కాగా, మూడో పర్యాయం బాంబే హైకోర్టులో ఆర్యన్ ఖాన్ కు ఊరట లభించింది. హైకోర్టు ఆర్యన్ కు బెయిల్ మంజూరు చేసింది.

తాజాగా, జరిగిన విచారణలో హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నిందితులు ఆర్యన్ ఖాన్, అర్బాజ్ మర్చంట్, మున్ మున్ ధమేచా మధ్య జరిగిన వాట్సాప్ చాటింగుల్లో ఎటువంటి అభ్యంతరకర అంశాలు లేవని పేర్కొంది. ఈ ముగ్గురు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు కుట్ర పన్నుతున్నారని న్యాయస్థానం విశ్వసించే ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది.

నిందితులు ముగ్గురూ ఒకే క్రూయిజ్ నౌకలో ఉండడం ఒక్కటే వారు తప్పు చేశారనడానికి ఆధారం కాబోదని బాంబే హైకోర్టు వ్యాఖ్యానించింది. దర్యాప్తు అధికారి నిందితుల నుంచి తీసుకున్న నేరాంగీకర వాంగ్మూలాలపై ఎన్సీబీ ఆధారపడరాదని, అవి చెల్లుబాటు కావని పేర్కొంది. ఈ మేరకు తాజా ఉత్తర్వులు జారీ చేసింది.