MS Dhoni: ఐపీఎల్ ట్రోఫీని తమిళనాడు సీఎం స్టాలిన్ కు అందించిన ధోనీ

  • ఇటీవల ఐపీఎల్ టైటిల్ గెలిచిన చెన్నై జట్టు
  • ధోనీ నాయకత్వంలో నాలుగో టైటిల్
  • ధోనీ పలు సీజన్ల పాటు చెన్నై జట్టులో కొనసాగాలన్న స్టాలిన్
  • చివరి మ్యాచ్ చెపాక్ స్టేడియంలో ఆడతానన్న ధోనీ
Dhoni handed IPL Trophy to Tamilnadu CM MK Stalin

తనలో మునుపటి వాడి తగ్గలేదని నిరూపిస్తూ మహేంద్ర సింగ్ ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మరో ఐపీఎల్ టైటిల్ అందించడం తెలిసిందే. తాజాగా చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో ధోనీ, చెన్నై జట్టు యజమాని శ్రీనివాసన్ ఐపీఎల్ ట్రోఫీని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కు అందించారు.

ఈ సందర్భంగా ధోనీని, చెన్నై సూపర్ కింగ్స్ జట్టును, ఫ్రాంచైజీ యాజమాన్యాన్ని సీఎం స్టాలిన్ అభినందించారు. ధోనీ ఝార్ఖండ్ కు చెందినవాడే అయినా తమిళనాడు ప్రజల కోసం వచ్చినట్టుందని వ్యాఖ్యానించారు. ధోనీ కూడా తమిళ ప్రజానీకంలో ఒకడిగా మారిపోయాడని పేర్కొన్నారు. మరెన్నో సీజన్ల పాటు ధోనీ చెన్నై జట్టుకు నాయకత్వం వహించాలని స్టాలిన్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సీఎం స్టాలిన్ కు చెన్నై జట్టు ఆటగాళ్ల సంతకాలతో కూడిన జెర్సీని కానుకగా అందించారు. నెంబర్ 7 జెర్సీపై 'ఎంకే స్టాలిన్' అని రాసి ఉండడం విశేషం.

ఇక, ధోనీ మాట్లాడుతూ, తనలో సత్తా ఇంకా మిగిలే ఉందని అన్నాడు. ఐపీఎల్ లో తన చివరి మ్యాచ్ ను చెన్నైలోని చెపాక్ మైదానంలో ఆడతానని వెల్లడించాడు. తద్వారా 2022 ఐపీఎల్ లో ఆడతానని సంకేతాలు ఇచ్చాడు. చెన్నై ప్రజలు ఎంతో సహృదయులని, గతంలో సచిన్ టెండూల్కర్ ముంబయి ఇండియన్స్ తరఫున తన చివరి మ్యాచ్ ను చెపాక్ లోనే ఆడాడని, అప్పుడు ప్రేక్షకులు లేచి నిలబడి మాస్టర్ కు అభివాదం చేశారని ధోనీ గుర్తు చేశాడు. కాగా, ఈ కార్యక్రమంలో చెన్నై జట్టు గతంలో గెలిచిన ఐపీఎల్ ట్రోఫీలను కూడా వేదికపై ప్రదర్శించారు.

More Telugu News