పైన్ రాజీనామాతో ఆసీస్ కొత్త కెప్టెన్ రేసులో ఈ ఇద్దరు!

20-11-2021 Sat 18:06
  • మహిళతో అసభ్య చాటింగ్
  • నిజమేనని ఒప్పుకుని కెప్టెన్సీ నుంచి తప్పుకున్న పైన్
  • కెప్టెన్ రేసులో కమిన్స్, స్మిత్
  • వచ్చే నెలలో యాషెస్
  • ఎటూ తేల్చుకోలేకపోతున్న ఆసీస్ బోర్డు
Australia Cricket exercises for new captain
అంతర్జాతీయ క్రికెట్లో ఆస్ట్రేలియా ఎప్పుడూ బలమైన జట్టే! అయితే కొన్నాళ్లుగా ఆ జట్టును వివాదాలు చుట్టుముడుతున్నాయి. మూడేళ్ల కిందట దక్షిణాఫ్రికా టూర్లో ఆసీస్ ఆటగాళ్లు బాల్ టాంపరింగ్ కు పాల్పడడం సంచలనం సృష్టించింది. ఆ దెబ్బతో నాటి కెప్టెన్ స్టీవ్ స్మిత్, ఓపెనర్ డేవిడ్ వార్నర్, మిడిలార్డర్ ఆటగాడు బాన్ క్రాఫ్ట్ నిషేధానికి గురయ్యారు. నిషేధం ముగియడంతో స్మిత్, వార్నర్ మళ్లీ ఆసీస్ జట్టులో పునరాగమనం చేశారు. అయితే స్మిత్ ను కాదని ఆసీస్ క్రికెట్ బోర్డు వికెట్ కీపర్ టిమ్ పైన్ ను కెప్టెన్ గా నియమించింది.

అనూహ్యరీతిలో పైన్ ఓ వివాదంలో చిక్కుకున్నాడు. కొన్నాళ్ల కిందట ఓ మహిళకు అసభ్య సందేశాలు పంపిన వైనం వెల్లడి కావడంతో పైన్ స్వచ్ఛందంగా కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. వచ్చే నెలలో ఇంగ్లండ్ తో ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్ ప్రారంభం కావాల్సి ఉండగా, కెప్టెన్సీ అంశం ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డును కలవరపాటుకు గురిచేస్తోంది.

ఇటీవల కాలంలో విశేషంగా రాణిస్తున్న యువ ఫాస్ట్ బౌలర్ ప్యాట్ కమిన్స్ పేరు కెప్టెన్సీ రేసులో బలంగా వినిపిస్తోంది. బ్యాటింగ్ లోనూ ధాటిగా ఆడే కమిన్స్ లో నాయకత్వ లక్షణాలు ఉన్నాయని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) భావిస్తోంది. కానీ త్వరలో జరగబోయేది యాషెస్ సిరీస్ కావడంతో ఆసీస్ బోర్డును ఆలోచనలో పడేస్తోంది.

ఇక, మాజీ సారథి స్టీవ్ స్మిత్ కు కెప్టెన్ గా మరో అవకాశం ఇవ్వాలన్న అంశం కూడా బోర్డు చర్చల్లో ప్రస్తావనకు వస్తోంది. స్మిత్ నాయకత్వంలో ఆస్ట్రేలియా జట్టు 34 టెస్టులు ఆడి 18 విజయాలు సాధించింది. కెప్టెన్ గా స్మిత్ విజయాల శాతం 50కి పైనే ఉంది. స్మిత్ కు మళ్లీ పగ్గాలు అప్పగించాలన్న ప్రతిపాదనలకు ఈ గణాంకాలు ఊతమిస్తున్నాయి. త్వరలోనే కెప్టెన్సీ ప్రతిష్టంభనకు తెరదించాలని ఆసీస్ బోర్డు కసరత్తులు చేస్తోంది. రేపో, ఎల్లుండో కొత్త కెప్టెన్ ను ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.