సంక్రాంతి బరిలోకి దిగనున్న 'బంగార్రాజు'

20-11-2021 Sat 17:03
  • షూటింగు దశలో 'బంగార్రాజు'
  • ఆల్రెడీ బయటికి వచ్చిన మాస్ బీట్
  • ఆకట్టుకున్న కృతి శెట్టి లుక్
  • ఈ నెల 23న రానున్న టీజర్      
Bangararju movie update
నాగార్జున - కల్యాణ్ కృష్ణ కాంబినేషన్లో 'బంగార్రాజు' సినిమా రూపొందుతోంది. నాగ్ సొంత బ్యానర్లో నిర్మితమవుతున్న ఈ సినిమా, ప్రస్తుతం షూటింగు దశలో ఉంది. నాగచైతన్య - కృతి శెట్టి యువ జంటగా ఈ సినిమాలో సందడి చేయనున్నారు. ఎప్పుడో అనుకున్న ఈ ప్రాజెక్టు అనేక కారణాల వలన ఆలస్యమవుతూ, ఇటీవలే సెట్స్ పైకి వెళ్లింది.

అయితే షూటింగు మొదలైన దగ్గర నుంచి ఎక్కడా పెద్ద గ్యాప్ లేకుండా కానిచ్చేస్తున్నారు. ఎలాంటి హడావిడి లేకుండానే ఈ సినిమా నుంచి నాగార్జున సాంగ్ ను వదిలారు. స్వర్గంలో రభ - ఊర్వశి - మేనకలతో ఆయన ఆడిపాడే సాంగ్ తో ఒక్కసారిగా అంచనాలు పెంచేశారు. ఈ పాటకి నాగ్ కూడా స్వరం కలపడం మరో విశేషం.

ఇక రీసెంట్ గా 'నాగలక్ష్మి' పాత్రలో కృతి శెట్టి లుక్ ను రిలీజ్ చేశారు. ఈ నెల 22వ తేదీన 'బంగార్రాజు' పోస్టర్ ను వదలనున్నట్టు ప్రకటించారు. అలాగే టీజర్ ను 23వ తేదీ ఉదయం రిలీజ్ చేయనున్నట్టు చెప్పారు. ఈ ఊపు ఉత్సాహం చూస్తుంటే, నాగార్జున తన సినిమాను సంక్రాంతికి దింపడం ఖాయమనే అనుకుంటున్నారు. "సంక్రాంతికి ఎన్ని సినిమాలు వచ్చినా చూస్తారు .. ఆ పండుగకి ఉన్న ప్రత్యేకత అదే'' అని గతంలో ఒకసారి నాగ్ చెప్పిన సంగతి తెలిసిందే.