మాజీ మిస్ కేరళ, మాజీ రన్నరప్ ల మృతి కేసులో ఆసక్తికర కోణం వెల్లడి

  • నవంబరు 1న కొచ్చి సమీపంలో రోడ్డు ప్రమాదం
  • ఇద్దరు మోడల్స్ దుర్మరణం
  • ఘటనపై పోలీసుల దర్యాప్తు
  • వారి కారును వెంటాడిన ఓ ఆడీ కారు
  • ఆడీ కారులో డ్రగ్స్ మాఫియా గ్యాంగ్ స్టర్
Interesting fact in former Miss Kerala and runner up road accident case probe

ఇటీవల మాజీ మిస్ కేరళ అన్సీ కబీర్, మాజీ రన్నరప్ అంజనా షాజన్ ఓ రోడ్డు ప్రమాదంలో మరణించారు. వారు ప్రయాణిస్తున్న కారు రోడ్డుపై ఓ బైక్ ను తప్పించే ప్రయత్నంలో చెట్టును ఢీకొని నుజ్జునుజ్జయింది. వేగంగా వెళ్లే ప్రయత్నంలో రోడ్డు ప్రమాదం జరిగిందని అందరూ భావించారు.

అయితే పోలీసుల దర్యాప్తులో ఓ ఆసక్తికర అంశం వెల్లడైంది. అన్సీ, అంజనా ప్రయాణిస్తున్న కారును ఓ ఆడీ కారు వెంబడించిందని, దాన్నుంచి తప్పించుకునే క్రమంలోనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ఓ అంచనాకు వచ్చారు. కారులో వీరిని వెంబడించింది డ్రగ్ మాఫియా గ్యాంగ్ స్టర్ సైజు థంకచ్చన్ అని గుర్తించారు.

అన్సీ, అంజనాలు రోడ్డు ప్రమాదానికి గురైంది నవంబరు 1న. ఆ రోజున వారు కొచ్చిలో ఓ స్టార్ హోటల్లో పార్టీకి హాజరయ్యారు. పార్టీలో అన్సీ, అంజనాలతో మాట్లాడిన సైజు థంకచ్చన్... పార్టీ ముగిసిన తర్వాత వారిని తనతో రావాల్సిందిగా కోరాడు. అయితే వారు అందుకు నిరాకరించారు. తమ కారులో వెళ్లిపోయేందుకు ప్రయత్నించగా, సైజు తన ఆడీ కారులో వారిని వెంబడించాడు. ఆ పార్టీకి వచ్చిన మరికొందరు కూడా సైజుతో పాటు ఆడీ కారులో ఉన్నారు. ఈ క్రమంలోనే అన్సీ, అంజనా వైటిల్లా-పలరివట్టోమ్ రహదారిపై ప్రమాదానికి గురయ్యారు.

కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు పార్టీ జరిగిన హోటల్ యజమానిని, ఇతర సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. సైజు థంకచ్చన్ కోసం గాలింపు జరుగుతున్నట్టు తెలుస్తోంది. థంకచ్చన్ కు కొచ్చిలో మాదకద్రవ్యాల సరఫరాదారులతో సంబంధాలు ఉన్నట్టు గుర్తించారు.

More Telugu News