ఎవరితోనో తిరగడం, తాగి పడిపోవడం మా ఇంటి ఆడవాళ్లకు అలవాటు లేదు: నందమూరి చైతన్య కృష్ణ

20-11-2021 Sat 14:55
  • రాజకీయాల కోసం ఇంట్లో ఆడవాళ్లను కించపరిచేలా మాట్లాడతారా?
  • భువనేశ్వరిపై ఇష్టమొచ్చినట్టు మాట్లాడారు
  • చంద్రబాబు కంటతడి పెడితే చూడలేకపోయాను
Nandamuri Chaitanya Krishna fires on YSRCP
టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నందమూరి కుటుంబం నిప్పులు చెరిగింది. ఈరోజు బాలకృష్ణ నివాసంలో కుటుంబ సభ్యులందరూ సమావేశమై... వైసీపీ నేతల వ్యాఖ్యలను ఖండించారు.

ఈ సందర్భంగా నందమూరి చైతన్య కృష్ణ మాట్లాడుతూ... తాత ఎన్టీఆర్ తమ కుటుంబంలోని ఆడవాళ్లను చాలా పద్ధతిగా పెంచారని... తమ ఇంట్లో ఆడపిల్లలు ఎంతో సంస్కారంతో పెరుగుతున్నారని చెప్పారు. ఎవరితోనో తిరగడం, తాగి పడిపోవడం తమ ఇంట్లో ఆడవాళ్లకు అలవాటు లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆడవాళ్ల గొప్పదనాన్ని చాటేలా ఎన్టీఆర్ ఎన్నో సినిమాలు తీశారని చెప్పారు. రాజకీయాల కోసం ఇంట్లో ఆడవాళ్లను కించపరిచేలా మాట్లాడతారా? అని మండిపడ్డారు. అత్త భువనేశ్వరిపై ఇష్టమొచ్చినట్టు మాట్లాడారని, మామ చంద్రబాబు కంటతడి పెడితే చూడలేకపోయానని అన్నారు.

నందమూరి సుహాసిని మాట్లాడుతూ... దివంగత ఎన్టీఆర్ ను ప్రజలంతా అన్నా అని పిలిచేవారని... మహిళలకు ఆయన ఎంతో గౌరవం ఇచ్చేవారని చెప్పారు. అలాంటి ఎన్టీఆర్ కూతురు గురించి వైసీపీ నేతలు ఇంత దారుణంగా మాట్లాడటం బాధాకరమని అన్నారు. భువనేశ్వరి ఏరోజు కూడా రాజకీయాల్లో జోక్యం చేసుకోలేదని చెప్పారు. రాజకీయాల్లోకి కుటుంబసభ్యులను తీసుకురావడం దురదృష్టకరమని... ప్రజలందరూ దీన్ని ఖండించాలని అన్నారు.