'ఒరేయ్..' అంటూ వైసీపీ నేతలకు భువనేశ్వరి సోదరుడి వార్నింగ్

20-11-2021 Sat 13:19
  • కన్నీటి పర్యంతమైన రామకృష్ణ
  • నందమూరి ఫ్యామిలీ దేవాలయమని కామెంట్
  • అసెంబ్లీ దేవాలయమన్న లోకేశ్వరి
  • మళ్లీ మాట్లాడితే మా మరో అవతారం చూస్తారని హెచ్చరిక
Ramakrishna Warning To YCP Leaders Who Humiliated Bhuvaneshwari
నిన్నటి పరిణమాలను చూస్తుంటే బాధేస్తోందని భువనేశ్వరి సోదరుడు నందమూరి రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. నందమూరి ఫ్యామిలీ దేవాలయం లాంటిదన్నారు. తమ కుటుంబంపైకి రావడాన్ని సహించబోమని హెచ్చరించారు. మీడియా ముందు ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. తమ ఆడపడుచుకు జరిగినట్టు ఎవరికీ జరగకూడదన్నారు. ఎవరి పేర్లను తీసుకురావద్దనుకున్నా సిచువేషన్ తప్పట్లేదని పేర్కొన్న ఆయన.. ‘ఒరేయ్ నానిగా.. ఒరేయ్ వంశీగా.. అంబటి రాంబాబు.. ఒరేయ్ .. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి’ అంటూ వార్నింగ్ ఇచ్చారు.

మీరు హద్దుమీరిపోయారని, ఇకపై జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. మీ ఇంట్లో ఆడవాళ్ల పరిస్థితి గురించి ఆలోచించుకోండని, తమ కుటుంబం మీదకొస్తే మాత్రం బాగుండదని వార్నింగ్ ఇచ్చారు. రాజకీయంగా ఉంటే చూసుకోవాలని, వ్యక్తిగత దూషణలను మానుకోవాలని అన్నారు. ఇక్కడ ఎవరూ చేతులకు గాజులు తొడుక్కొని కూర్చోలేదని హెచ్చరించారు. తమకు క్రమశిక్షణ అలవర్చారని, అందుకే సహనంతో ఉంటున్నామని చెప్పారు.  


నిన్న జరిగిన ఘటన దురదృష్టకరమని భువనేశ్వరి సోదరి లోకేశ్వరి అన్నారు. అసెంబ్లీ దేవాలయమని, కానీ, కొందరు నోటికొచ్చినట్టు మాట్లాడి అపవిత్రం చేస్తున్నారన్నారు. చంద్రబాబు అంతలా ఏడుస్తుంటే చూడలేకపోయామని, తన చెల్లెలిని అవమానించడం బాధగా అనిపించిందని పేర్కొన్నారు. జగన్ తల్లి, భార్య, చెల్లిని ఏనాడూ చంద్రబాబు పల్లెత్తు మాట అనలేదని, ఎవరినీ అననివ్వలేదని చెప్పారు. మళ్లీ తమ కుటుంబ సభ్యులను ఇలాంటి రాజకీయాల్లోకి లాగకూడదని ఆమె హెచ్చరించారు. ఇంకోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే తమ మరో అవతారం చూడాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు.