చంద్రబాబుకు జరిగిన అవమానాన్ని భరించలేక హెడ్ కానిస్టేబుల్ రాజీనామా!

20-11-2021 Sat 12:09
  • ఉద్యోగానికి రాజీనామా చేసిన ప్రకాశం జిల్లా హెడ్ కానిస్టేబుల్
  • అసెంబ్లీలో వైసీపీ నేతలు దారుణంగా వ్యవహరించారని మండిపాటు
  • ఇలాంటి వారి వద్ద పని చేయలేనని వ్యాఖ్య
Head constable resigns to his job in protest of YSRCP misbehavior with Chandrababu
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో నిన్న జరిగిన పరిణామాలు ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. ముఖ్యంగా టీడీపీ శ్రేణులు వైసీపీ నేతలపై మండిపడుతున్నాయి. తమ అధినేత చంద్రబాబు కంటతడి పెట్టడాన్ని టీడీపీ మద్దతుదారులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లాకు చెందిన ఓ హెడ్ కానిస్టేబుల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబుపై వైసీపీ నేతల మాటలను ఖండిస్తూ తన ఉద్యోగానికి ఆయన రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన ఒక వీడియోను విడుదల చేశారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

తాను ఎంతో అభిమానించే చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు 1998 బ్యాచ్ సివిల్ కానిస్టేబుల్ గా ప్రకాశం జిల్లా నుంచి టాపర్ గా నిలిచానని ఆయన తెలిపారు. ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ఎంతో నిజాయతీతో పని చేశానని చెప్పారు. ఎప్పుడూ ఎవరి వద్దా చేయి చాచకుండా విధులను నిర్వర్తించానని తెలిపారు. ఇప్పుడు ఏపీలో నెలకొన్న పరిస్థితులు ప్రజలందరికీ తెలుసని చెప్పారు. ముఖ్యమంత్రిగా పని చేసిన ఒక వ్యక్తిని అసెంబ్లీలో దూషించడం సరికాదని... విలువలు లేని వారి వద్ద పని చేయడం ఇష్టం లేకే ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నానని అన్నారు.