శివ నిర్వాణతో విజయ్ దేవరకొండ సినిమా ఉన్నట్టే!

20-11-2021 Sat 11:21
  • శివ నిర్వాణ ఖాతాలో రెండు హిట్లు
  • అంచనాలు అందుకోని 'టక్ జగదీష్'
  • జనవరిలో విజయ్ దేవరకొండ ప్రాజెక్టు  
  • ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగు
Vijay Devarakonda in Shiva Nirvana movie
టాలీవుడ్ లోని యంగ్ డైరెక్టర్లలో శివ నిర్వాణ ఒకరు. తన సినిమాలకి సంబంధించిన కథలను తానే తయారు చేసుకుంటాడు. స్క్రీన్ ప్లే - మాటలు తానే సమకూర్చుకుంటాడు. అందువలన ప్రతి పాత్రపై ఆయనకి ఒక స్పష్టత ఉంటుంది. తాను చెప్పదలచుకున్న కథను ఎలాంటి తడబాటు లేకుండా చెబుతాడు. 'నిన్ను కోరి' .. 'మజిలీ' వంటి హిట్లు ఆయన ఖాతాలో ఉన్నాయి.

ఇటీవల వచ్చిన 'టక్ జగదీష్' బాగోలేదని అనలేం .. అలాగని హిట్ అని చెప్పలేం. మొత్తం మీద ఫరవాలేదనిపించుకుంది. ఈ సినిమాకి ముందే విజయ్ దేవరకొండతో శివ నిర్వాణ ఒక సినిమా చేయాలనుకున్నాడు. స్క్రిప్ట్ రెడీ చేయడం కూడా జరిగిపోయింది. అయితే పూరి నుంచి 'లైగర్' ఛాన్స్ రావడంతో విజయ్ దేవరకొండ అటువైపు వెళ్లాడు.

దాంతో ఈ సినిమా లేనట్టేననే ప్రచారం జరిగింది. కానీ ఈ సినిమా ఉందనే విషయాన్ని విజయ్ దేవరకొండ సన్నిహితులు చెబుతున్నారు. ఆల్రెడీ అగ్రిమెంట్ కూడా జరిగిపోయిందని అంటున్నారు. జనవరిలో ఈ సినిమా పూజా కార్యక్రమాలు నిర్వహించి, ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగుకు వెళతారని చెబుతున్నారు. మరి ప్రస్తుతం శివ నిర్వాణ సిద్ధం చేస్తున్న కథ ఎవరికోసమో!