మోదీకి ధన్యవాదాలు: సోనుసూద్

20-11-2021 Sat 10:02
  • వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవడం శుభ పరిణామమన్న సోను
  • శాంతియుత నిరసనలు చేపట్టిన రైతులకు ధన్యవాదాలని వ్యాఖ్య
  • రక్తం మరిగితే ఆకాశం కూడా భూమి మీదకు వస్తుందన్న ఊర్మిళ
Sonu Sood response on farm laws move
గత ఏడాది కాలానికి పైగా వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచిన కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రధాని మోదీ సంచలన ప్రకటన చేశారు. మోదీ ప్రకటనపై బీజేపీకి చెందిన కొందరు నేతలు కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ఈ పనేదో ముందే చేస్తే... రైతుల నుంచి వ్యతిరేకత ఉండేది కాదు కాదా అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు కేంద్రం నిర్ణయాన్ని మరికొందరు స్వాగతిస్తున్నారు.

సినీనటుడు సోనుసూద్ స్పందిస్తూ... ఇదొక శుభ పరిణామమని చెప్పారు. వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకున్న మోదీకి ధన్యవాదాలు చెపుతున్నానని అన్నారు. శాంతియుతంగా నిరసన కార్యక్రమాలను చేపట్టిన రైతులకు కూడా ధన్యవాదాలు తెలిపారు. సినీనటి, శివసేన నాయకురాలు ఊర్మిళ మాట్లాడుతూ... విజయం సాధించడానికి బలమైన పట్టుదల కావాలని అన్నారు. రక్తం మరిగితే ఆకాశం కూడా భూమి మీదకు వస్తుందని చెప్పారు. ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన రైతు సోదరులు, సోదరీమణులకు శాల్యూట్ చేస్తున్నానని చెప్పారు.