అర్ధరాత్రి నీట మునిగిన నెల్లూరు భగత్‌సింగ్ కాలనీ.. ప్రాణాలు కాపాడుకునేందుకు నడుము లోతు నీళ్లలో పరుగులు

20-11-2021 Sat 07:26
  • ఉదయం నుంచే కాలనీలోకి నీరు
  • రాత్రికి పూర్తి స్థాయిలో కమ్మేసిన వైనం
  • అప్రమత్తమైన అధికారులు
  • బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించిన వైనం
  • సహాయక చర్యలను పర్యవేక్షించిన మంత్రి అనిల్ కుమార్
Heavy Rains lashed Nellore Bhagath singh Colony
నెల్లూరులో గత అర్ధరాత్రి ప్రజలు భయంతో వణికిపోయారు. ఎడతెరిపిలేని వర్షాలతో అతలాకుతలం అవుతున్న నగరంలో అర్ధరాత్రి దాటాక స్థానిక భగత్‌సింగ్ కాలనీ పూర్తిగా నీటిలో మునిగిపోయింది. ఉదయం నుంచే కొంతకొంతగా నీరు చేరడంతో అప్రమత్తమైన అధికారులు బాధితులు కొందరిని అక్కడి నుంచి జనార్దనరెడ్డి కాలనీలోని టిడ్కో ఇళ్లకు తరలించారు.

అర్ధరాత్రి దాటాక వరద నీరు కాలనీని పూర్తిగా ముంచెత్తడంతో ప్రజలు ప్రాణభయంతో వణికిపోయారు. పిల్లలను పట్టుకుని రక్షించుకునేందుకు నడుము లోతు నీళ్లలో పరుగులు తీశారు. దీంతో రంగంలోకి దిగిన సహాయక బృందాలు కాలనీ వాసులను నగరంలోని డీకేడబ్ల్యూ కళాశాలకు తరలించారు. మంత్రి అనిల్ కుమార్ సహాయక చర్యలను పర్యవేక్షించారు.