ఏబీ డివిలియర్స్ రిటైర్మెంట్ తో నా గుండె పగిలింది: అనుష్క శర్మ

19-11-2021 Fri 20:05
  • అన్ని స్థాయుల క్రికెట్ కు వీడ్కోలు పలికిన ఏబీ
  • డివిలియర్స్ ఉన్నతమైన వ్యక్తి అని పేర్కొన్న అనుష్క
  • అతడి కుటుంబానికి సుఖసంతోషాలు లభించాలని ఆకాంక్ష
  • డివిలియర్స్ తో పరిచయం గౌరవంగా భావిస్తానని వెల్లడి
Anushka Sharma opines on AB De Villiers retirement
దక్షిణాఫ్రికా యోధుడు ఏబీ డివిలియర్స్ క్రికెట్లో అని ఫార్మాట్లు, అన్ని స్థాయుల నుంచి తప్పుకుంటున్నట్టు నేడు ప్రకటన చేశారు. దీనిపై విరాట్ కోహ్లీ అర్ధాంగి అనుష్క శర్మ స్పందించారు. డివిలియర్స్ రిటైర్మెంట్ నిర్ణయంతో తన గుండె పగిలినంత పనైందని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఇన్ స్టాగ్రామ్ లో స్పందించారు.

తనకు పరిచయం ఉన్న ఉన్నతమైన పురుషులు, క్రికెటర్లలో డివిలియర్స్ ఒకరని అనుష్క శర్మ పేర్కొన్నారు. డివిలియర్స్ ఆటను చూడడం, ఆయనతో పరిచయం కలిగి ఉండడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తానని పేర్కొన్నారు.

"మీకు, డానియెల్లే (డివిలియర్స్ అర్ధాంగి)కి, పిల్లలకు జీవితంలో ఎల్లప్పుడూ సుఖశాంతులు కలగాలని ఆకాంక్షిస్తున్నాను. మీరు జీవితంలో అన్ని ఆనందాలకు అర్హులు. అంతకుమించి కూడా మీకు లభించాలని కోరుకుంటున్నాను" అంటూ అనుష్క తన స్పందన వెలిబుచ్చారు.

2018లోనే అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన ఏబీ డివిలియర్స్ నేటితో ఫ్రాంచైజీ క్రికెట్ కు కూడా స్వస్తి పలికాడు. ఇకపై ఐపీఎల్, బిగ్ బాష్ వంటి ప్రైవేటు లీగుల్లో ఏబీ మెరుపులు ఇక కనిపించవు. భవిష్యత్తులో కోచింగ్ వైపు కానీ, కామెంటరీ వైపు కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.