పంజాబ్ కు ఒక న్యాయం, తెలంగాణకు మరో న్యాయమా?: హరీశ్ రావు

19-11-2021 Fri 19:09
  • పంజాబ్ నుంచి ధాన్యం కొంటున్నారన్న హరీశ్ రావు
  • తెలంగాణ నుంచి ఎందుకు కొనరని ఆవేదన
  • వానాకాలం పంటను రాష్ట్ర ప్రభుత్వం కొంటుందని వెల్లడి
  • రైతులను ఆదుకుంటామని హామీ
Harish Rao questions central govt on paddy procurement
పంజాబ్ రాష్ట్రం నుంచి వరి ధాన్యం కొంటున్నట్టుగా తెలంగాణ నుంచి ఎందుకు కొనుగోలు చేయడంలేదని మంత్రి హరీశ్ రావు కేంద్రాన్ని ప్రశ్నించారు. పంజాబ్ కు ఒక న్యాయం, తెలంగాణకు ఇంకో న్యాయమా? అని నిలదీశారు. బాయిల్డ్ రైస్ కొనం అనే మాట తమను తీవ్రంగా బాధించిందని హరీశ్ రావు అన్నారు.

యాసంగి పంటను కొనుగోలు చేస్తారో, లేదో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం తన విధానాలను మార్చుకోవాలని స్పష్టం చేశారు. దేశంలో వరి అధికంగా పండితే ఆ ధాన్యాన్ని ఆఫ్రికా దేశాలకు, ఇతర ప్రపంచ దేశాలకు ఎగుమతి చేయొచ్చని సూచించారు.

సిద్ధిపేట జిల్లాలోని పలు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన సందర్భంగా హరీశ్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు. వానాకాలం పంటపై రైతులకు మాటిచ్చామని, కేంద్రం కొనకపోయినా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. అందుకే రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు నెలకొల్పామని చెప్పారు.