Austria: కరోనా కేసులు ఉద్ధృతం... ఆస్ట్రియాలో మళ్లీ లాక్ డౌన్

  • ఇంకా తొలగిపోని కరోనా ముప్పు
  • ఆస్ట్రియాలో వేల సంఖ్యలో రోజువారీ కేసులు
  • వ్యాక్సిన్లపై ఆసక్తి చూపని ప్రజలు
  • లాక్ డౌన్ విధించక తప్పడంలేదన్న ఆస్ట్రియా చాన్సలర్
Austria goes into lock down again

ప్రపంచదేశాలను గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి ఇప్పట్లో సద్దుమణిగేట్టు కనిపించడంలేదు. తాజాగా పశ్చిమ యూరప్ దేశం ఆస్ట్రియాలో ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఆస్ట్రియాలో ప్రస్తుతం రోజుకు 15 వేల వరకు పాజిటివ్ కేసులు వస్తుండడం అక్కడి ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. మరోవైపు వ్యాక్సినేషన్ కు అక్కడి ప్రజలు మొగ్గు చూపకపోవడం కూడా ప్రభుత్వాన్ని ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెడుతోంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రియాలో లాక్ డౌన్ ప్రకటించారు.

దీనిపై ఆస్ట్రియా చాన్సలర్ అలెగ్జాండర్ షాలెన్ బర్గ్ స్పందిస్తూ, గత కొన్ని నెలలుగా ఎంత విడమర్చి చెప్పినా వ్యాక్సిన్లు తీసుకునేందుకు ప్రజలు ముందుకు రావడంలేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వ్యాక్సిన్ తీసుకోవడానికి విముఖత చూపించడం అంటే ఆరోగ్య శాఖను ధిక్కరించడం వంటిదేనని స్పష్టం చేశారు. మరోవైపు కొత్త కేసులు కమ్ముకొస్తున్నాయని, దాంతో లాక్ డౌన్ విధించడం తప్పడంలేదని అన్నారు.

సోమవారం నుంచి లాక్ డౌన్ అమల్లోకి వస్తుందని, ఆపై 10 రోజుల తర్వాత పరిస్థితిని సమీక్షిస్తామని వెల్లడించారు. లాక్ డౌన్ సమయంలో ప్రజలు కేవలం అత్యవసరాల కోసమే బయటికి రావాల్సి ఉంటుందని ఆస్ట్రియా చాన్సలర్ అలెగ్జాండర్ షాలెన్ బర్గ్ వివరించారు.

అంతేకాదు, వచ్చే ఏడాది ఫిబ్రవరి 1 నుంచి దేశంలోని ప్రతి పౌరుడు వ్యాక్సిన్ తీసుకోవడం తప్పనిసరి చేస్తున్నట్టు ప్రకటించారు. కరోనా తీవ్రత నేపథ్యంలో పశ్చిమ యూరప్ లో మళ్లీ లాక్ డౌన్ లోకి వెళ్లిన తొలిదేశం ఆస్ట్రియానే.

More Telugu News