Pollution: పంట వ్యర్థాల కాల్చివేతే ఢిల్లీ కాలుష్యానికి ప్రధాన కారణం.. వెల్లడించిన నాసా

  • శాటిలైట్ ఫొటోల ద్వారా తేల్చిన వైనం
  • దానికి వాహనాలు, బాణసంచా తోడు
  • పాకిస్థాన్ నుంచి వచ్చే ధూళీ కారణమే
Stubble Burning Is The Main Reason For Delhi Air Pollution Says NASA

కొన్ని రోజులుగా కాలుష్యంతో ఢిల్లీ ఎంతలా అతలాకుతలమవుతోందో మనం చూస్తూనే ఉన్నాం. సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని మందలించింది కూడా. రైతులపై నెపాన్ని నెట్టడం సరికాదని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ఆ తర్వాత స్కూళ్లు, ఆఫీసులను ఢిల్లీ మూసేసింది. అయితే, రైతులు పంట వ్యర్థాలను కాల్చడం వల్లే నవంబర్–డిసెంబర్ మధ్య ఢిల్లీలో ఎక్కువగా కాలుష్యం నమోదవుతోందని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా చేసిన అధ్యయనంలో వెల్లడైంది.


దానికి వాహన కాలుష్యం, బాణసంచా కాల్చడం వంటివి కొంత ఆజ్యం పోస్తున్నాయని తేలింది. విజిబుల్ ఇన్ ఫ్రారెడ్ ఇమేజింగ్ రేడియోమీటర్ స్విట్ (వీఐఐఆర్ఎస్) ద్వారా ఈ ఏడాది నవంబర్ 11న ఉన్న పరిస్థితిని నాసా పరిశీలించింది. షువామీ ఎన్పీపీ శాటిలైట్ ద్వారా ఫొటోలను తీసింది. ఆ రోజు పంజాబ్, హర్యానాల్లో పంట వ్యర్థాలను తగులబెట్టడం వల్ల ఢిల్లీ వైపు భారీ మొత్తంలో పొగ వచ్చిందని తేల్చి చెప్పింది. పాకిస్థాన్ లో మంటలూ దానికి తోడయ్యాయని పేర్కొంది.

ఆ ఒక్కరోజే పొగ వల్ల 2.2 కోట్ల మంది పెను ప్రభావానికి లోనయ్యారని నాసా మార్షల్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ శాస్త్రవేత్త పవన్ గుప్తా చెప్పారు. నవంబర్ 12న కూడా దాని ప్రభావం ఎక్కువగా ఉందని తెలిపారు. థార్ ఎడారి నుంచి కొట్టుకొచ్చిన ధూళి, వాహన కాలుష్యం, నిర్మాణ కాలుష్యం, టపాకాయల కాలుష్యం కూడా తీవ్రతకు కారణమయ్యాయని చెప్పారు. ఉష్ణోగ్రతల్లో వ్యత్యాసాలూ కాలుష్యం పెరగడానికి కారణమన్నారు. కాగా, పంజాబ్, హర్యానాల్లో కలిపి 17 వేల హాట్ స్పాట్లున్నట్టు నాసా గొడ్డార్డ్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ శాస్త్రవేత్త హీరేన్ జేథ్వా చెప్పారు.

More Telugu News