మళ్లీ సీఎం అయ్యాకే అసెంబ్లీలోకి అడుగుపెడతా: చంద్రబాబు శపథం

19-11-2021 Fri 12:46
  • అసెంబ్లీ సమావేశాలు దారుణంగా జరుగుతున్నాయి
  • నా పరువును దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు
  • నా కుటుంబసభ్యులను కూడా రోడ్డుపైకి లాగుతున్నారు
I will come to assembly as a CM says Chandrababu
టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు. మళ్లీ ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగుపెడతానని... అంతవరకు సభలో అడుగుపెట్టబోనని ఆయన అన్నారు. తనను వ్యక్తిగతంగా దూషిస్తున్నారని మండిపడ్డారు. ఏ పరువు కోసమైతే తాను తాపత్రయపడ్డానో... దాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని వైసీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు తన భార్య ప్రస్తావన కూడా తీసుకొస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సభలో ఎన్నో చర్చలను చూశామని... కానీ ఇంత దారుణంగా సభ జరగడాన్ని ఎప్పుడూ చూడలేదని అన్నారు.

కుప్పం మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత చంద్రబాబు ముఖం చూడాలనుందని సీఎం జగన్ అన్నప్పటికీ తాను పట్టించుకోలేదని చెప్పారు. తన కుటుంబసభ్యులను రోడ్డుపైకి లాగుతున్నారని అన్నారు. ఈ సభలో తాను ఉండలేనని... మళ్లీ ముఖ్యమంత్రిగానే సభలో అడుగుపెడతానని సభలోని అందరికీ నమస్కారం చేస్తూ బయటకు వెళ్లిపోయారు. ఆయనతో పాటు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా సభ నుంచి బయటకు వచ్చేశారు.