ఏపీలో భారీ వర్షాలు.. చెయ్యేరు నది వరదలో కొట్టుకుపోయిన 30 మంది

19-11-2021 Fri 12:36
  • మూడు మృతదేహాలను వెలికితీసిన అధికారులు
  • చిత్తూరు, కడప, అనంతపురం, నెల్లూరుల్లో వరద ప్రభావం
  • వరద పరిస్థితిపై జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్ సమావేశం
  • ముంపు బాధితులకు తక్షణమే రూ.2 వేల సాయం
30 People Drown Away In Cheyyeru River Flood
భారీ వర్షాలు ఏపీని అతలాకుతలం చేస్తున్నాయి. రాయలసీమ జిల్లాల్లో జనజీవనాన్ని స్తంభింపజేశాయి. చిత్తూరు, కడప, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో ముంపు ప్రభావం ఎక్కువగా ఉంది. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. కడప జిల్లాలోని అన్నమయ్య జలాశయం మట్టికట్ట కొట్టుకుపోయింది. దీంతో నది పరీవాహక ప్రాంతంలో వరద ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. గుండ్లూరు, శేషమాంబాపురం, మందపల్లి గ్రామాలు మునిగాయి.

చెయ్యేరు నది నుంచి నందలూరు, రాజంపేట తదితర ప్రాంతాల్లో వరద పోటెత్తింది. దీంతో నందలూరు పరీవాహక ప్రాంతంలోని మండపల్లి, ఆకేపాడు, నందలూరు ప్రాంతంలో చెయ్యేరు వరదలో సుమారు 30 మంది కొట్టుకుపోయినట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు గాలింపు చేపట్టి మూడు మృతదేహాలను వెలికి తీశారు.

వానలు, వరదల పరిస్థితిపై అధికారులతో సీఎం జగన్ సమీక్ష చేశారు. ఆయా జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ముంపు బాధితులకు రూ.2 వేల తక్షణ ఆర్థిక సాయం ప్రకటించారు. గండి పడిన చెరువులకు వెంటనే మరమ్మతులు చేయాలని ఆదేశించారు. తిరుపతిలో భారీగా వరద నీరు నిల్వడానికి గల కారణాలను విశ్లేషించాలని సూచించారు. జబ్బులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

ఇదీ పరిస్థితి..


అనంతపురం జిల్లా వెల్దుర్తి వద్ద చిత్రావతి నదిలో జేసీబీ చిక్కుకుంది. దానిపై 8 మంది ఉన్నారు. వరదలోనే వారంతా చిక్కుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ప్రాణాలు అరచేతపట్టుకుని హెలికాప్టర్ కోసం ఎదురు చూస్తున్నారు. వరద ఉద్ధృతి ఎక్కువగా ఉండడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. కడప జిల్లా చారిరేవువంకలో పాపాగ్ని నది ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో.. ఓ వ్యక్తి ఆటోతో సహా గల్లంతయ్యాడు. భారీ వర్షాలకు తిరుపతి–కడప, తిరుపతి–పీలేరు మార్గాల్లో ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. కల్యాణి జలాశయం వద్ద వరద  ఎక్కువగా ఉండడంతో పీలేరులో వాహనాలను ఆపేశారు.

భారీ వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న వరద, కొండచరియలు విరిగిపడుతుండడంతో తిరుమలలోని రెండు ఘాట్ రోడ్లను అధికారులు మూసేశారు. రెండో ఘాట్ రోడ్డులో 18 చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో కపిలతీర్థం, తిరుమల బైపాస్ రోడ్డుపై వందలాది వాహనాలు నిలిచిపోయాయి. తిరుపతి నగరంలో నడుములోతు వరద నిలిచింది. బైకులు పూర్తిగా మునిగిపోయాయి. పలుచోట్ల కొన్ని బైకులు కొట్టుకుపోయాయి.