శర్వానంద్ సినిమా కూడా ఓటీటీలోనే?

19-11-2021 Fri 11:44
  • వరుస ఫ్లాపులతో శర్వానంద్
  • చేతిలో రెండు సినిమాలు
  • ఓటీటీకి 'ఒకే ఒక జీవితం'
  • సెట్స్ పై 'ఆడవాళ్లు మీకు జోహార్లు'  
Oke Oka Jeevitham movie update
శర్వానంద్ కి ఈ మధ్యకాలంలో కథలు కలిసిరావడం లేదనే చెప్పాలి. 'మహానుభావుడు' తరువాత ఆయున హిట్ అనే మాటను వినలేదు. 'పడి పడి లేచే మనసు' .. 'రణరంగం' .. 'జాను' .. 'శ్రీకారం' ఇటీవల వచ్చిన 'మహాసముద్రం' సినిమాలు పరాజయాలను అందుకున్నాయి.

నాని తరువాత ఆ స్థాయిలో కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకునే హీరోగా శర్వానంద్ కి పేరు ఉండేది. అలాంటి శర్వానంద్ కి వరుస ఫ్లాపులు పడుతుండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ప్రస్తుతం ఆయన చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. ఒకటి 'ఆడవాళ్లు మీకు జోహార్లు' అయితే, మరొకటి 'ఒకే ఒక జీవితం'.

డ్రీమ్ వారియర్ పిక్చర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాలో రీతూ వర్మ కథానాయికగా నటిస్తుండగా, ఒక కీలకమైన పాత్రలో అమల కనిపించనుంది. ఈ సినిమా ఫిబ్రవరిలో థియేటర్లకు వస్తుందని కొన్ని రోజుల క్రితం చెప్పారు. కానీ ఇప్పుడు ఈ సినిమాను ఓటీటీకి ఇవ్వడానికి రెడీ అవుతున్నట్టుగా ఒక టాక్ వినిపిస్తోంది. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి.