'మాయా' కాంబినేషన్లో మరో హారర్ మూవీ!

19-11-2021 Fri 10:58
  • నయనతార నాయికగా వచ్చిన 'మాయా'
  • హారర్ థ్రిల్లర్ జోనర్లో నడిచిన కథ
  • అదే కాంబినేషన్లో రూపొందుతున్న 'కనెక్ట్'
  • కీలకమైన పాత్రలో అనుపమ్ ఖేర్  
Connect Movie Nayanatara first look released
నయనతార కథానాయికగా కొంతకాలం క్రితం 'మాయా' అనే సినిమా వచ్చింది. హారర్ థ్రిల్లర్ జోనర్లో ఈ కథ నడుస్తుంది. ఒక తల్లి ఆత్మ తన కూతురును కాపాడుకోవడం కోసం పడే ఆరాటమే ఈ సినిమా. ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఈ కథ నడుస్తుంది. దర్శకుడు అశ్విన్ శరవణన్ ఈ సినిమాతో మంచి మార్కులు కొట్టేశాడు.

ఈ సినిమా నయనతార కెరియర్లో చెప్పుకోదగిన చిత్రంగా నిలిచింది. మళ్లీ ఇంతకాలానికి అదే దర్శకుడు నయనతారతో మరో హారర్ సినిమాను రూపొందిస్తున్నాడు .. ఆ సినిమా పేరే .. 'కనెక్ట్'. నిన్న నయనతార పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఆమె ఫస్టులుక్ పోస్టర్ ను వదిలారు. ఈ పోస్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది.

నయనతార - విఘ్నేశ్ శివన్ కలిసి నిర్వహిస్తున్న రౌడీ పిక్చర్స్ బ్యానర్ పైనే ఈ సినిమా నిర్మితమవుతోంది. ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలలో అనుపమ్ ఖేర్ .. సత్యరాజ్ కనిపించనున్నారు. గతంలో 'మాయా' సినిమా తెలుగులో 'మయూరి'గా వచ్చి హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక 'కనెక్ట్' కూడా కాసుల వర్షం కురిపిస్తుందేమో చూడాలి.