Sundar Pichai: నా వద్ద ఎలాంటి క్రిప్టో కరెన్సీ లేదు: సుందర్ పిచాయ్

  • బ్లూంబెర్గ్ టీవీకి సుందర్ పిచాయ్ ఇంటర్వ్యూ
  • తన కుమారుడు ఎథేరియం మైనింగ్ చేశాడని వెల్లడి
  • తన ఇంట్లో మామూలు కంప్యూటర్ ఉందని వివరణ
  • అది తాను తయారుచేసిన కంప్యూటర్ అని చెప్పిన పిచాయ్
Sundar Pichai says he has no cryptocurrency

గూగుల్, దాని మాతృసంస్థ ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ ఇటీవల బ్లూంబెర్గ్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర అంశాలు వెల్లడించారు. తన వద్ద ఎలాంటి క్రిప్టో కరెన్సీ నిల్వలు లేవని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అయితే, తన కుమారుడు 2018లోనే ఎథేరియం మైనింగ్ చేశాడని, అప్పటికి అతడికి 11 ఏళ్లు ఉంటాయని వెల్లడించారు.

అయితే క్రిప్టోకరెన్సీ మైనింగ్ చేయాలంటే అత్యంత శక్తిమంతమైన కంప్యూటర్లు కావాల్సి ఉంటుంది. దీనిపై టీవీ యాంకర్ ప్రశ్నిస్తూ, మరి మీ ఇంట్లో పవర్ ఫుల్ సర్వర్ ఉందా? దాని సాయంతో మీ కుమారుడికి క్రిప్టో మైనింగ్ లో సాయపడతారా? అని పిచాయ్ ని అడిగారు. అందుకు పిచాయ్ బదులిస్తూ, తన ఇంట్లో ఓ సాధారణ పీసీ మాత్రమే ఉందని, అది కూడా దాన్ని తానే రూపొందించానని వివరించారు.

క్రిప్టో కరెన్సీ మైనింగ్ అంటే... అత్యంత సంక్లిష్టమైన క్రిప్టోగ్రాఫిక్ సమీకరణాలను ఛేదించడం. తద్వారా క్రిప్టోకరెన్సీ కాయిన్స్ (బిట్ కాయిన్, ఎథేరియం) గెలుచుకోవచ్చు. అంటే, సంక్లిష్టమైన సమీకరణాలను ఛేదించి ఎలాంటి డబ్బు చెల్లించకుండానే క్రిప్టో కాయిన్లను సొంతం చేసుకోవచ్చు. దీనికోసం శక్తిమంతమైన కంప్యూటర్లు, అత్యధిక సామర్థ్యం కల ప్రాసెసర్లతో కూడిన సర్వర్లు అవసరం అవుతాయి. క్రిప్టోకరెన్సీల్లో ఎథేరియం కూడా ఒకటి. బిట్ కాయిన్ తరహాలో ఇది కూడా ఎంతో విస్తృతమైంది.

More Telugu News