Sivaji: ఏపీ అంటేనే కులాల కుంపటి.. అంబానీ కూడా దేశం విడిచి వెళ్లాలనుకుంటున్నారు: నటుడు శివాజీ

  • సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని ఎవరూ గుర్తు పెట్టుకోవడం లేదు
  • మనమందరం బాగా కలుషితమయ్యాం
  • అమరావతిని ఏదో చేద్దామనుకుంటే భ్రమే
AP filled with caste feelings says actor Sivaji

ఆంధ్రప్రదేశ్ అంటేనే కులాల కుంపటి అని సినీ నటుడు శివాజీ విమర్శించారు. ఈ కులాల కుంపట్ల మధ్య రాష్ట్రం ఏం అభివృద్ధి చెందుతుందని ప్రశ్నించారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని ఎవరూ గుర్తుంచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సినిమాలో సీన్లను గుర్తు పెట్టుకున్నంత ఈజీగా... సమాజంలో జరుగుతున్న వాటిని గుర్తు పెట్టుకోవడం లేదని అన్నారు.

మనమందరం బాగా కలుషితమైపోయామని చెప్పారు. అందరూ దీన్నించి బయటపడితే కానీ... భవిష్యత్ తరాలకు మంచి జీవితాలను ఇవ్వలేమని అన్నారు. అమరావతి రైతులు చేపట్టిన పాదయాత్రకు శివాజీ సంఘీభావం ప్రకటించారు. వారిని కలిసి తన మద్దతు తెలిపారు.

దేశంలో రాజకీయ వ్యవస్థ భ్రష్టు పట్టిందని... వీటిని భరించలేక అంబానీ వంటి వారే దేశం విడిచి వెళ్లిపోవాలనుకుంటున్నారని శివాజీ చెప్పారు. అమరావతిని ఏదో చేద్దామనుకుంటే భ్రమేనని... అమరావతిని ఎవరూ ఏమీ చేయలేరని అన్నారు. ఏపీకి ఏకైక రాజధాని అమరావతే అని చెప్పారు. ఎన్నికల్లో ఎంత డబ్బు పంచినా ఓటర్లు ఆత్మసాక్షికే ఓటు వేస్తారని అన్నారు.

కొడాలి నాని, బొత్స సత్యనారాయణ వంటి వారు ఎన్ని మాటలు మాట్లాడినా పట్టించుకోవాల్సిన అవసరం లేదని... తామే శాశ్వతం అని రాజకీయ నాయకులు అనుకుంటే కుదరదని చెప్పారు. మీడియా కూడా వర్గాలుగా విడిపోయిందని చెప్పారు.

More Telugu News